DS Chauhan on Grain Procurement in Telangana : రాష్ట్రంలో ధాన్యం సేకరణ ఆరోగ్యకరమైన వాతావరణంలో సాగుతుందని పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ (DS Chauhan) అన్నారు. ప్రతిరోజు జిల్లాల వారీగా అన్ని గ్రామాల్లో ధాన్యం సేకరణపై తాము సమీక్షిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ ఎర్రమంజిల్ పౌరసరఫరాల భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ సంచాలకులు లక్ష్మీబాయి, పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ ఏడాది యాసంగి మార్కెటింగ్ సీజన్‌లో ధాన్యం సేకరణ పురోగతి, క్షేత్రస్థాయి పరిస్థితులు, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలపై కమిషనర్ డీఎస్ చౌహాన్ స్పందించారు. తాజాగా సాగుతున్న ధాన్యం సేకరణ, పౌరసరఫరాల శాఖ తీసుకుంటున్న చర్యలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో ధాన్యం నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించిన దృష్ట్యా రైతులు, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, రైస్ మిల్లర్లకు అవగాహన కల్పిస్తూ శిక్షణ ఇస్తున్నామని చెప్పారు.
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే వడ్లు అమ్ముకోవాలి :గ్రామీణ ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కనీస మద్దతు ధరలు చెల్లిస్తున్నందున రైతులెవరూ ఎంఎస్పీ(minimum support price) కంటే తక్కువ ధరలకు అమ్ముకోవద్దని డీఎస్ చౌహాన్ సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 7149 ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయించిన పౌరసరఫరాల శాఖ, ఇప్పటి వరకు 6919 కేంద్రాలు తెరిచి సరకు సేకరిస్తుందని స్పష్టం చేశారు. పల్లెల్లో దళారులకు కాకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే రైతులు వడ్లు అమ్ముకోవాలని సూచించారు.