Drone Videography in Telangana : ఏవైనా కార్యక్రమాలు ఘనంగా జరిగితే సంబరాలు అంబరాన్నంటాయని చెబుతుంటారు. ప్రస్తుతం డ్రోన్లు, డ్రోన్ కెమెరాలు నిజంగానే చేసి చూపిస్తున్నాయి. జీవితంలో ప్రతి వేడుకను ఓ మధుర జ్ఞాపకంగా మలచుకోవాలని అందరూ కోరుకుంటారు. అందులో భాగంగానే ఫొటోలు, వీడియోలు, విందులు, వినోదాలు చేసుకుంటారు. తాజాగా ఆ జాబితాలో కొత్తగా డ్రోన్ వీడియోగ్రఫీ చేరింది. ఈ మధ్య హైదరాబాద్ సహా నగరాలు, పట్టణాల్లో జరిగే చాలా వేడుకల్లో డ్రోన్ తప్పనిసరిగా వాడుతున్నారు.
ఖర్చు ఎంతైనా కూడా వీటిని వినియోగిస్తున్నారు. అలాగే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, ట్రావెల్ వ్లాగర్లు, యూట్యూబర్లు తమ చిత్రీకరణల్లో డ్రోన్ షాట్లను భాగం చేస్తున్నారు. మరోవైపు పోలీసులకు నిఘా అస్త్రంగానూ డ్రోన్ ఉపయోగపడుతోంది. ర్యాలీలు, ఉత్సవాల్లో వీటి సాయంతోనే ఆకతాయిలు, సంఘ విద్రోహశక్తులు చొరబడకుండా అప్రమత్తత వహిస్తున్నారు.
నగరంలో జోరందుకుంటున్న వినియోగం :గతేడాది అమరవీరుల స్మారకం ప్రారంభోత్సవంలో 800 డ్రోన్లతో హైదరాబాద్‌లో తొలిసారి ప్రదర్శన ఇచ్చారు. తర్వాత దుర్గం చెరువు వద్ద, పోలీస్ అకాడమీ, వింగ్స్ ఇండియా 2024 లో చేపట్టిన డ్రోన్ షోలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బెంగళూరు, దిల్లీ, హైదరాబాద్‌కు చెందిన పలు సంస్థలు డ్రోన్లను నిర్వహిస్తున్నాయి. సాధారణ వీడియోగ్రాఫర్లు వీటిని వినియోగించడానికి ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు.
వివాహాల చిత్రీకరణకు రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు ధరలను ఉంచుతున్నారు. వ్యక్తిగత డ్రోన్ల ఖరీదు రూ.45 వేల- రూ.లక్ష వరకు ఉన్నాయి. వేడుకలకు సంబంధించి రూ.1 లక్ష 50 వేల నుంచి రూ.3 లక్షలు, సినిమాలకు వినియోగించేవి రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఉంటాయని డ్రోనికా ఇన్నొవేషన్స్ నిర్వాహకులు అశోక్ తెలిపారు.