Drinking Water Problems In Karimnagar : కరీంనంగర్ నగర పాలక సంస్థ పరిధిలో తాగునీటికిఇక్కట్లు మొదలయ్యాయి. దిగువ మానేరు జలాశయంలో నీటి నిల్వలు వేగంగా అడుగంటుతున్నాయి. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం(Medigadda Barrage Damage) వల్ల కాళేశ్వరం ఎత్తిపోతలు ఆగిపోయాయి. దీంతో వేసవిలో నీటి సరఫరాపై ఆందోళన నెలకొంది.
దిగువ మానేరు జలాశయంలో ప్రస్తుతం 5టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రతి రోజు దిగువకు 3వేల249 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. 2 వేల100 క్యూసెక్కుల నీరు మధ్య మానేరు నుంచి వస్తోంది. వచ్చే దాని కంటే అదనంగా 1149 క్యూసెక్కుల నీరు మానేరు నుంచి దిగువకు వదలాల్సిన పరిస్థితి. ప్రతిరోజు నీటిని సరఫరా చేసే నగరపాలక సంస్థ ఇప్పుడు రోజు విడిచి రోజు ఇస్తోంది.
"నీటి కొరత వల్ల మేము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. నీరు అరగంట కూడా సక్రమంగా రావట్లేదు. ఫలితంగా డబ్బులు పెట్టి ట్యాంకర్లను తెప్పించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మార్చిలోనే పరిస్థితి ఇలా ఉంటే ఏప్రిల్, మేలో ఇంకా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. మా సమస్యకు పరిష్కారం చూపండి. " - స్థానిక మహిళ
వర్షాకాలంలో తప్పని నీటి యెద్దడి... మహిళలు బిందెలతో నిరసన
నగరంలో మొదలైన తాగునీటికి ఇక్కట్లు :జలాశయంలో ప్రస్తుతం అయిదు టీఎంసీలే మిగిలి ఉంటుంది. అందులో రెండు టీఎంసీలు డెడ్ స్టోరేజీ, మూడు టీఎంసీల నీరు ఉండే అవకాశముంది. దీనితో ఇప్పటికే ఎలగందుల, సిద్దిపేట, నగరానికి తాగునీటికి కష్టాలు మొదలయ్యాయి. నగరపాలక నీటిశుద్ధి కేంద్రానికి 65 ఎంఎల్‌డీల రావాటర్ రావాల్సి ఉండగా 53 ఎంఎల్‌డీలు వస్తుండటంతో సరిపోవడం లేదు. 8 టీఎంసీలు నిల్వ ఉంటే తప్ప రోజు సరఫరా చేయడం సాధ్యం కాదంటున్నారు.