Doctors Protest Across the State : కోల్‌కతాలో వైద్యవిద్యార్థినిపై హత్యాచారం ఘటనను ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు హోరెత్తాయి. పల్నాడు జిల్లా గురజాల ప్రభుత్వ డాక్టర్లు ఆసుపత్రి నుంచి బస్ స్టాండ్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. బాపట్ల, అద్దంకి, చీరాలలో ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య సిబ్బంది విధులను బహిష్కరించారు. మంగళగిరి NRIఆసుపత్రి వైద్యులు ర్యాలీ నిర్వహించారు. మంగళగిరి ఎయిమ్స్ వైద్యులు మానవహారం చేపట్టారు. వారి ఫ్లాష్ మాబ్ అందరిని ఆలోచింపజేసింది. వీరి ఆందోళనకు ఏపీ కౌలు రైతు సంఘం మద్దతు ప్రకటించింది.
రాష్ట్రవ్యాప్తంగావైద్యుల నిరసన : ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో నిరసన ర్యాలీ జరిగింది. మెడికోలకు న్యాయం చేయాలని, మహిళలపై అత్యాచారాలు అరికట్టాలని గళమెత్తారు. వైద్యవిద్యార్థినిపై జరిగిన హత్యపై న్యాయం చేయాలని నరసరావుపేటలోని కలెక్టర్ కార్యాలయం, జిల్లా ఎస్పీ కార్యాలయంలోని అధికారులకు మహిళా వైద్యులు వినతిపత్రం అందజేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లావ్యాప్తంగా ఆసుపత్రుల్లో ఓపీ సేవలు నిలిపివేశారు. గుంటూరులో భారీ నిరసన ప్రదర్శన చేశారు.
'మహిళలకు రక్షణ ఏది ?' - మంగళగిరిలో వైద్య విద్యార్థులు ఫ్లాష్ మాబ్ - Strike on Kolkata Incident
విధులను బహిష్కరించిన వైద్యులు :కోల్‌కతాలో వైద్యవిద్యార్థినిపై జరిగిన పాశవిక ఘటనను వ్యతిరేకిస్తూ ఒంగోలులో రిమ్స్ నుంచి చర్చి సెంటర్ వరకు జూడాలు నిరసన ర్యాలీ, మానవహారం నిర్వహించారు. నర్సాపురంలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ర్యాలీగా వెళ్లి సబ్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. అంబాజీపేట ముక్కామల పి.హెచ్.సి వైద్యులు నిరసన ప్రదర్శన చేశారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో ప్రభుత్వ వైద్యులు నిరసనగళం వినిపించారు. కాకినాడ జిల్లా తునిలో డాక్టర్లు విధులు బహిష్కరించి ఆందోళన చేశారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై సమాజం తీవ్రంగా ప్రతిస్పందించాల్సిన అవసరం ఉందని విశాఖలో పెద్ద ఎత్తున నినదించారు. మహిళా వైద్యులపై అఘాయిత్యాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని శ్రీకాకుళం, అల్లూరి జిల్లా వైద్యులు విధులను బహిష్కరించి ఆందోళన చేశారు.