Doctor Ravali CPR to Boy on The Road in Vijayawada :వైద్యో నారాయణ హరి అంటారు. అంటే వైద్యులు దేవునితో సమానం అని. విద్యుదాఘాతానికి గురై కుప్పకూలి ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలుడ్ని భుజాన వేసుకుని ఆస్పత్రికి పరుగెత్తుతున్న తల్లిదండ్రులకు ఆ డాక్టరమ్మ దేవతలా ప్రత్యక్షమైంది. నేనున్నానని భరోసానిస్తూ రోడ్డుపైనే సీపీఆర్ చేసి చిన్నారికి ఊపిరి పోసింది. ఈనెల 5న ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో జరిగిన ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది.
విజయవాడ అయ్యప్పనగర్‌కు చెందిన ఆరేళ్ల బాలుడు సాయి ఈ నెల 5వ తేదీన ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురయ్యాడు. బుజ్జి కన్నా లేవరా అని తల్లడిల్లుతూ తల్లిదండ్రులు ఎంత పిలిచినా ఉలుకూ పలుకూ లేదు. ఒక్కసారిగా వారి గుండె ఆగినంత పనైంది. తన్నుకొస్తున్న దుఃఖాన్ని దిగమింగుకొని బిడ్డను భుజాన వేసుకొని ఆసుపత్రికి పరుగులు తీశారు. ఈ దృశ్యాలు అక్కడున్న వారిని తీవ్రంగా కలచివేశాయి.
హార్ట్ ఎటాక్ వస్తే సీపీఆర్ ఎలా చేయాలి? సింపుల్ స్టెప్స్ ఇవిగో!
Doctor Ravali Viral Video: మెడ్‌సీ ఆసుపత్రిలో ప్రసూతి వైద్య నిపుణురాలైన డాక్టర్ నన్నపనేని రవళి అటుగా వెళ్తూ ఇదంతా గమనించారు. తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. బాలుడ్ని పరీక్షించి అక్కడే రోడ్డుపైనే పడుకోబెట్టమని చెప్పారు. అనంతరం కార్డియో పల్మోనరీ రిససిటేషన్-సీపీఆర్ చేయడం ప్రారంభించారు. ఒకవైపు డాక్టర్ రవళి బాలుడి ఛాతీపై చేతితో ఒత్తుతూ అక్కడున్న మరో వ్యక్తిని నోటితో గాలి ఊదమని సూచించారు. ఇలా ఏడు నిమిషాలకు పైగా చేశాక బాలుడిలో కదలిక వచ్చింది. వైద్యురాలి కృషి ఫలించడంతో ఆ బాలుడు మళ్లీ ఊపిరితీసుకున్నాడు.