Doctor Commits Murders to Escape Debts: జల్సాలకు అలవాటు పడిన ఓ జూనియర్ వైద్యుడు ఎడాపెడా అప్పులు చేశాడు. తీరా అప్పు తీర్చమని అడిగే సరికి డబ్బులు లేకపోవటంతో మత్తు ఇంజక్షన్లు ఇవ్వటం మొదలుపెట్టాడు. ఇలా మత్తు ఇంజక్షన్ ఇచ్చి ఒకరిని హతమార్చి, మరో ఇద్దరిని అనారోగ్యానికి గురి చేశాడు. ఈ ఘటన ఏలూరు జిల్లాలో చోటు చేసుకుంది. బాధితుడు హిమతేజ ఫిర్యాదుతో ఎట్టకేలకు ఆ వైద్యుడి నేరాలు బయటపడ్డాయి. దీంతో ఆ వైద్యుడు కటకటాల పాలయ్యాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం: ఏలూరు శివారు చోదిమెళ్లలో నివాసం ఉంటున్న కొవ్వూరి భానుసుందర్ ఫిలిప్పిన్స్‌లో ఎంబీబీఎస్ (M.B.B.S) పూర్తి చేసి నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పని చేస్తున్నాడు. ఆన్లైన్ బెట్టింగులకు అలవాటు పడి అప్పుల ఊబిలో ఇరుక్కుపోయాడు. అప్పులు తీర్చే దారిలేక అప్పు ఇచ్చిన వారికి మార్ఫిన్ ఇంజక్షన్ ఇచ్చి ఏమార్చేవాడు.
9సంవత్సరాల బాలికకు ఏడు ఇంజక్షన్లు - పాప మృతి!
ఈ క్రమంలోనే చోదిమెళ్లకు చెందిన తంబి అలియాస్ మల్లేశ్వరరావుతో భాను సుందర్ సన్నిహితంగా ఉండేవాడు. అతడికి గతేడాది మత్తు ఇంజక్షన్ ఇచ్చాడు. స్పృహ కోల్పోయాక ఇంట్లో చొరబడి బంగారం నగలు, లక్షా యాభై వేల రూపాయల నగదు దొంగిలించుకుని పోయాడు. ఇంజక్షన్ ఇచ్చిన అనంతరం తీవ్ర అనారోగ్యానికి గురైన మల్లేశ్వరరావు మృతి చెందాడు. ఇదేవిధంగా ఏలూరుకు చెందిన హిమతేజ, సత్రంపాడుకు చెందిన రాయల్ వెంకట్, వెంకట విష్ణువర్ధన్‌కు ఇంజక్షన్లు ఇచ్చాడు.
హిమతేజ, భాను సుందర్ స్నేహితులు. ఈ క్రమంలో హిమతేజ వద్ద కొంత అప్పు తీసుకున్నాడు. దానిలో కొంత సొమ్ము తిరిగి ఇచ్చాడు. మిగిలిన నగదు అడుగుతుండటంతో అతడి వద్ద బ్లడ్ శాంపిల్ తీసుకునే క్రమంలో భానుసుందర్ మత్తు ఇంజక్షన్ ఇచ్చాడు. తర్వాత అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన హిమతేజను విజయవాడలోని ఓ ఆస్పత్రి తీసుకెళ్లి చేర్పించాడు. ఇలా అప్పు ఇచ్చిన వారందరికీ ఇంజక్షన్ ఇచ్చాక ఆసుపత్రిలో చేర్పించి అక్కడ వైద్యు సేవల నిమిత్తం ఎక్కువ డబ్బు ఖర్చయిందని చెప్పి బాధితుల కుటుంబ సభ్యులు వద్ద మరికొంత నగదు తీసుకున్న ఘటనలు కూడా ఉన్నాయి.
నాసిరకం మందుల వల్లే పిల్లలకు అస్వస్థత: కొల్లు రవీంద్ర
ఈ విధంగా భానుసుందర్ నేరాలకు పాల్పడుతున్నాడు. అతడిపై రూరల్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో చాకచక్యంగా దర్యాప్తు చేసిన ఎస్సైలు లక్ష్మణ్ బాబు, నవీన్ కుమార్‌ను సీఐ రాజశేఖర్ అభినందించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సీఐ మీడియాకు వెల్లడించారు.
జల్సాలకు అలవాటు పడి - అప్పిచ్చిన వాళ్లనే చంపేసిన వైద్యుడు