తెలంగాణ

telangana

ETV Bharat / state

వెల్డర్లు, ఎలక్ట్రీషియన్ అయినా ఫర్వాలేదు - విదేశాల్లో ప్రభుత్వమే మీకు ఉద్యోగం ఇప్పిస్తుంది - TELANGANA OVERSEAS MANPOWER COMPANY

విదేశాల్లో ఉద్యోగాలు చేయాలనుకునే వారికి వారధిగా టాంకాం - హాస్పిటాలిటీ రంగంలో, నర్సింగ్‌ కోర్సు చేసిన వారికి జర్మనీ, జపాన్‌లలో ఉద్యోగాలు

TELANGANA OVERSEAS MANPOWER COMPANY
టాంకాం లోగో (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 10, 2024, 10:58 PM IST

Jobs in Abroad through TOMCOM :తెలంగాణలోని నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగాలు కల్పిస్తూ తెలంగాణ ఓవర్సీస్‌ మ్యాన్‌ పవర్‌ కంపెనీ లిమిటెడ్‌ బాసటగా నిలుస్తోంది. గతంలో ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లేందుకు ఏజెంట్లను ఆశ్రయించి నగదు సమర్పించుకోవాల్సి వచ్చేది. ఈ ప్రక్రియ ద్వారా గతంలో ఎందరో మోసపోయిన విషయాన్ని ప్రభుత్వం గుర్తించి 2015లో టాంకాంను ఉపాధి కల్పనాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసింది. అంతే కాకుండా ఉద్యోగాల సాధించేందుకు కావాల్సిన నైపుణ్యాలను కూడా నేర్పిస్తున్నారు ఈ టాంకాం అధికారులు.

ఈ ఉద్యోగాలకు డిమాండ్ :జపాన్‌, జర్మనీ దేశాల్లో హాస్పిటల్​ రంగంలో, నర్సింగ్‌ కోర్సు చేసిన వారికి ఉద్యోగాలు భారీగా లభిస్తున్నాయి. వెల్డర్లు, ఎలక్ట్రీషియన్లకు సైతం ఆయా దేశాల్లో డిమాండ్‌ ఉంది. బిల్డింగ్​ కన్​స్ట్రక్షన్ వర్క్, డ్రైవింగ్, డెలివరీ బాయ్స్ వంటి రంగాల్లో ఈ ఉద్యోగాలకు కూడా భారీగా డిమాండ్‌ ఉంది. స్వదేశంలోని నిరుద్యోగులకు విదేశాల్లోని ఉద్యోగాల కోసం పూర్తి వివరాలతో టాంకాం యాప్‌ను అందుబాటులో ఉంచింది. గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి టాంకాం యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని తమ విద్యార్హతల మేరకు ఏఏ దేశాల్లో ఎలాంటి ఉద్యోగాలు ఉన్నాయో తెలుసుకోవచ్చు. తమ విద్యార్హతలను యాప్‌లో ఎంటర్​ చేసి ఉద్యోగం కోసం సంబంధిత అధికారుల నుంచి వారి సహకారం తీసుకోవచ్చు.

TELANGANA OVERSEAS MANPOWER COMPANY LIMITED (ETV Bharat)

ప్రభుత్వ సహకారం ఇలా :నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగాలు కల్పించే ఉద్దేశంతో టాంకాం పలు దేశాలతో ఒప్పందం(ఏంఓయూ) కుదుర్చుకుంది. హైదరాబాద్‌లోనే ప్రభుత్వం తెలంగాణ నిరుద్యోగుల కోసం విదేశీ ఉద్యోగాల స్కిల్‌ టెస్టింగ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. కరీంనగర్‌ ప్రభుత్వ ఐటీఐ, నిజామాబాద్‌ జిల్లా ఉపాధి కల్పన అధికారి కార్యాలయంలో సెంటర్లను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని ఉపాధికల్పనాధికారి కార్యాలయాల్లో ఈ విషయమై అధికారులు అభ్యర్థులకు సహాయ సహకారాలు అందిస్తుండటం విశేషం.

  • ఇప్పటి వరకు జపాన్, జర్మనీ, యూఎస్‌ఏ, ఇజ్రాయెల్, యూకే, న్యూజిలాండ్, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాలతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఆయా దేశాల అవసరాల దృష్టిలో ఉంచుకుని ఉద్యోగాలు కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు ఇజ్రాయెల్‌ దేశంలో 351 మంది, యూఎస్‌ఏ, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, కెనడా దేశాల్లో 124 మంది, జపాన్‌లో 32 మంది, జర్మనీలో 37 మంది, ఉద్యోగాలు పొందడం మంచి పరిణామం. విదేశాల్లో సులభంగా ఉద్యోగాలు సాధించేందుకు ముందస్తుగా ట్రైనింగ్​ క్లాసులను నిర్వహిస్తున్నారు.

విదేశాల్లో ఉద్యోగాలు చేయాలనుకునే వారికి టాంకాం ఒక వంతెన లాగా పనిచేస్తుంది. యాప్‌ను చూస్తే టాంకాం పూర్తి సమాచారాన్ని ఇట్టే పొందవచ్చు. యాప్‌లో తమ విద్యార్హలను అప్‌లోడ్‌ చేసి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రత్యక్షంగా తమను సంప్రదించిన కూడా వారి ఎడ్యూకేషన్​ను బట్టి స్కిల్స్​ను పెంపొందించేందుకు ట్రైనింగ్​ కల్పిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ఈ సహకారాన్ని అభ్యర్థులు వినియోగించుకోవాలి -షబ్నం, టాంకాం రాష్ట్ర నోడల్‌ అధికారిణి

తెలంగాణలో పెరిగిన ఉద్యోగావకాశాలు - యువతలో తగ్గుతున్న నిరుద్యోగం

'టాటాల ఎంట్రీతో ఇక్కడ చదివేవారి దశ తిరగబోతోంది!'

ABOUT THE AUTHOR

...view details