Female Devotee Stuck in Temple : ఆలయ సిబ్బంది మహిళా భక్తురాలిని ఆలయంలోనే ఉంచి తాళం వేసి వెళ్లిపోయిన విచిత్రమైన ఘటన ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా జరిగింది. దీంతో ఆమె రాత్రంతా గుడిలోనే ఒంటరిగా చిక్కుకుపోయింది. జిల్లాలోని బోయకొండ గంగమ్మ దర్శనానికి వచ్చిన మహిళా భక్తురాలికి ఈ చేదు అనుభవం ఎదురైంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో ఆలయ సిబ్బందిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాత్రంతా ఒంటరిగా ఆమె గుడిలో గడపడంతో తన ధైర్యానికి ఫిదా అవుతూ, సిబ్బందిపై విమర్శలు చేస్తున్నారు.
ఆలయ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం, సోమల మండలానికి చెందిన ఓ దివ్యాంగ భక్తురాలు మంగళవారం బోయకొండ గంగమ్మ అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారు. అయితే అప్పటికే రాత్రి సమయం కావడంతో ఆలయ సిబ్బంది ఆమె గుడిలో ఉందనే విషయం గుర్తించకుండా తలుపులు మూసి తాళం వేసి వెళ్లిపోయారు. దీంతో ఆమె రాత్రంతా ఒంటరిగా ఆలయంలో ఉన్నారు. బుధవారం ఉదయం అక్కడే పనిచేసే పారిశుద్ధ్య కార్మికరాలు దివ్యాంగ మహిళను గుర్తించి, ఆలయ సిబ్బందికి సమాచారం అందించారు.
భక్తుల దర్శనార్థం అమ్మవారు కనిపించడానికి క్యూలైన్లలో ఎత్తుగా ఏర్పాటు చేసిన చెక్కల కింద ఆ మహిళ ఉన్నట్లు సదరు మహిళ గుర్తించింది. వెంటనే అక్కడకు చేరుకున్న ఆలయ సిబ్బంది దివ్యాంగ భక్తురాలిని చెక్కల కింద నుంచి బయటకు తీశారు. అనంతరం ఈ విషయం ఆలయ ఈవో ఏకాంబరం దగ్గరకు వెళ్లడంతో దివ్యాంగ మహిళ వివరాలను సేకరించి ఆమెను ఇంటికి పంపించేశారు. అయితే ఈ విషయం ఎలాగో బయటకు రావడంతో ఆలయ సిబ్బంది తీరుపై విమర్శలు వస్తున్నాయి.