MLA Disqualification Pititions in High Court : పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సహేతుకమైన సమయంలో తేల్చాలని స్పీకర్‌కు హైకోర్టు స్పష్టం చేసింది. సహేతుక సమయం నిర్ణయించే ముందు ఇప్పటికే అనర్హత పిటిషన్లు పెండింగ్‌లో ఉన్న సమయాన్ని, రాజ్యాంగంలో పదో షెడ్యూలు ఉద్దేశం, అసెంబ్లీ కాలపరిమితిని దృష్టిలో ఉంచుకోవాలన్న విషయాన్ని చెప్పాల్సిన అవసరంలేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అనర్హత పిటిషన్లపై షెడ్యూలు నిర్ణయించాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును కొట్టివేసింది.
బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేలుగా గెలిచిన దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో వారిపై అనర్హత వేటు వేయాలంటూ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కె.పి.వివేకానందలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీరితోపాటు బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి పార్టీ ఫిరాయింపులపైనే మరో పిటిషన్ దాఖలు చేశారు. అనర్హత పిటిషన్లను స్పీకర్ స్వీకరించకపోవడంతో వీరు హైకోర్టును ఆశ్రయించారు. వీటిపై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి 4 వారాల్లో అనర్హత పిటిషన్లపై షెడ్యూలు ఖరారు చేయాలంటూ సెప్టెంబరు 9న తీర్పు వెలువరించారు.
సింగిల్ జడ్జి తీర్పు రద్దు : వీటిని సవాలు చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వి.నరసింహాచార్యులు వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జె. శ్రీనివాసరావులతో కూడిన ధర్మాసనం సుదీర్ఘ వాదనల అనంతరం ఈ నెల(నవంబర్) 12న రిజర్వు చేసి, శుక్రవారం(నవంబర్ 22)న 78 పేజీల తీర్పును వెలువరించింది. అనర్హత పిటిషన్లపై షెడ్యూలు ఖరారు చేయడానికి ఫైళ్లను స్పీకర్ ముందుంచాలని అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించగా, తరువాత 4 వారాల్లో షెడ్యూలు నిర్ణయించాలని, లేదంటే తామే తేల్చాల్సి ఉంటుందంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేసింది.
స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే సుప్రీం కోర్టుకు వెళతాం : కేటీఆర్
ఈ సందర్భంగా అనర్హత పిటిషన్లకు సంబంధించి సుప్రీం కోర్టు వెలువరించిన పలు తీర్పులను ప్రస్తావించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న తీర్పులనే పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలిపింది. కిహొటో హోలోహాన్ కేసులో రాజ్యాంగంలోని 10వ షెడ్యూలు అంశాలను ధ్రువీకరించిందని, స్పీకర్ నిర్ణయం తీసుకోకముందు కోర్టులు జోక్యం చేసుకోరాదని సుప్రీం కోర్టు తీర్పు స్పష్టం చేసినట్లు పేర్కొంది.
అనర్హత పిటిషన్ల విచారణ సందర్భంగా ప్రజా ప్రతినిధులను సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం ద్వారా తీవ్రపరిణామాలు తలెత్తినపుడు మాత్రమే జోక్యం చేసుకోవచ్చని తెలిపింది. అయితే ఇదే కేసులో అధికరణ 136, 226, 227 కింద సుప్రీం, హైకోర్టుల జోక్యాన్ని పూర్తిగా నిషేధించలేదని, పరిధికి సంబంధించిన అంశాల్లోనే పరిమితులను పేర్కొందని తెలిపింది. రాజ్యాంగ ఉల్లంఘనలు, దురుద్దేశాలు, సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా ఉన్నపుడు కోర్టులు జోక్యం చేసుకోవచ్చని ఈ తీర్పు స్పష్టం చేసినట్లు తెలిపింది.
అప్పట్లో ఎర్రబెల్లి దయాకర్‌రావు కేసు : అసెంబ్లీ కాలపరిమితిని దృష్టిలో ఉంచుకుని రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువలు, నైతిక సూత్రాల పరిరక్షణ కోర్టు విధుల్లో భాగంగా పేర్కొన్న ప్రత్యేక కేసుగా ధర్మాసనం పేర్కొంది. తాజాగా సుప్రీం కోర్టు వెలువరించిన సుభాష్ దేశాయ్ కేసులో అనర్హత పిటిషన్లపై సహేతుక సమయంలో స్పీకర్ తేల్చాల్సి ఉంటుందని పేర్కొన్నట్లు తెలిపింది. 10వ షెడ్యూలు ప్రకారం ట్రైబ్యునల్‌గా స్పీకర్ ఉంటారని, ఒక కోర్టు విధుల్లోకి మరో కోర్టు జోక్యం చేసుకోరాదని ఎర్రబెల్లి దయాకర్ రావు కేసులో ఇదే హైకోర్టు తీర్పు వెలువరించిందని తెలిపింది. అయితే ఈ తీర్పు సుభాష్ దేశాయ్ కేసులో సుప్రీం కోర్టు తీర్పునకు ముందుగా వచ్చిందని, అందువల్ల దాన్ని పరిగణనలోకి తీసుకోలేమని తెలిపింది.
రాజ్యాంగంలో అత్యున్నత పదవీ స్పీకర్ : ఈ తీర్పులన్నింటినీ పరిశీలిస్తే 10వ షెడ్యూలు కింద అనర్హత పిటిషన్లపై తేల్చే అధికారం స్పీకర్ కు ఉందని స్పష్టమవుతోందని పేర్కొంది. రాజ్యాంగ అత్యున్నత పదవిలో స్పీకర్ ఉంటారని, సమాజం చట్టానికి లోబడి ఉంటుందని, రాజ్యాంగమే అత్యున్నతమైనదని పేర్కొంది. పదో షెడ్యూలు ప్రకారం స్పీకర్ తన అధికారాలను వినియోగిస్తారని, అదే సమయంలో స్పీకర్ నిర్ణయం కిహొటో హోలోహాన్, రాజేంద్రసింగ్ రాణా, సుభాష్ దేశాయ్ కేసుల ప్రకారం న్యాయసమీక్షకు లోబడి ఉంటుందని పేర్కొంది. అనర్హత పిటిషన్లపై స్పీకర్ సహేతుకమైన సమయంలో తేల్చాల్సింది ఉందని పేర్కొంది. సహేతుక సమయం అన్నది ఆ కేసులోని అంశాలు, పరిస్థితులపై ఆధారపడి ఉంటాయని తెలిపింది.
ప్రస్తుత కేసులో అనర్హత పిటిషన్లు దాఖలు చేసి నాలుగున్నర నెలల సమయం గడిచిపోయిందని, నిబంధనలకు లోబడి అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేస్తున్నామని ధర్మాసనం పేర్కొంది. అనర్హత పిటిషన్లపై ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న సమయం, అసెంబ్లీ కాలపరిమితి లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని సహేతుక సమయంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు స్పష్టం చేస్తూ 78 పేజీల తీర్పు వెలువరించింది.
కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయొద్దు : తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు
తగిన సమయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి - ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు తీర్పు