తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆశ్చర్యం! - ఒకే మామిడి చెట్టుకు 15 రకాల పండ్లు - మందార మొక్కకు 20 రకాల పూలు

ఒకే మామిడి చెట్టుకు 15 రకాల కాయలు - ఒకే మందార మొక్కకు 20 రకాల పూలు - నర్సరీలో వినూత్న ప్రయోగం - కుండీల్లోనూ పెంచుకోవచ్చు అంటున్న ఉద్యానశాఖ అధికారులు

TYPES OF FRUITS IN ONE MANGO TREE
Different Type Fruits on Single Mango Tree (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Oct 18, 2024, 12:05 PM IST

Updated : Oct 18, 2024, 1:59 PM IST

Different Type Fruits on Single Mango Tree : వేసవి కాలంలో పండ్లు అనగానే గుర్తొచ్చేది మామిడి పండు. ఆ సీజన్​లో మార్కెట్లో మామిడి పండ్లకు డిమాండ్​ భారీగానే ఉంటుంది. మార్కెట్లోనే కాకుండా నచ్చిన మామిడి పండ్లను ఇప్పుడు ఇంట్లోనూ పండించుకుని తినొచ్చు. పండ్లే కాకుండా ఇష్టమైన రకరకాల పూలను సైతం పెరట్లోనే పెంచి కోసుకోవచ్చు. దీని కోసం వందల చెట్లు, పూల మొక్కలు అవసరం లేదండోయ్‌. కేవలం ఒకే ఒక్క మొక్క ఉంటే చాలు. అవునండీ, మీరు చదివింది నిజమే. ఒక్క మామిడి చెట్టు నుంచి వివిధ రకాల పండ్లను పొందొచ్చు. అలాగే ఒకే మందారం చెట్టుకు వివిధ రకాల పూలనూ పెంచుకోవచ్చు. అదెలా అంటారా? ఇప్పుడు తెలుసుకుందాం రండి.

అంటు కట్టిన మామిడి మొక్క (ETV Bharat)

ఒకే చెట్టు నుంచి వందల పండ్లు, ఒకే పూల మొక్క నుంచి వివిధ రకాల పూలు పెంచేలా అరుదైన ప్రయోగానికి ఆంధ్రప్రదేశ్​లోని పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట ఐటీడీఏకు చెందిన తురాయిపు వలస ఉద్యాన క్షేత్రం అధికారులు శ్రీకారం చుట్టారు. మిక్స్‌డ్‌ పేరుతో అంట్లు కట్టే విధానాన్ని వీరు ప్రారంభించారు. కొన్ని రోజులుగా ప్రయోగాత్మకంగా వీటి తయారీకి చర్యలు చేపట్టారు. ఒకే చెట్టు నుంచే 15 నుంచి 20 రకాల మామిడి కాయలు, ఒకే మందార మొక్క నుంచే దాదాపు 20 రకాల పూలు పూసేలా సిద్ధం చేస్తున్నారు. అవసరం మేర పండ్ల మొక్కలను, పూల మొక్కలను నాటుకోవచ్చు. ఎక్కువ స్థలం లేకపోతే పెద్ద కుండీల్లోనూ ఎంచక్కా పెంచుకోవచ్చు.

అంటు కట్టిన మందార మొక్కలను చూపిస్తున్న ఉద్యానశాఖ అధికారి కాంతారావు (ETV Bharat)

బత్తాయి, నిమ్మపైనా ప్రయోగాలు :మూడు నెలల్లోనే అంటు కట్టిన మందారం మొక్క నుంచి నచ్చిన పూలు వస్తాయి. మామిడికి సంబంధించి రెండేళ్ల పాటు పూతను తొలగించి, మూడో ఏడాది నుంచి కాపునకు వదిలేయాలని ఉద్యానశాఖ అధికారి కె.కాంతారావు వివరించారు. ప్రస్తుతం రెండేసి వేల చొప్పున తయారు చేస్తున్నామని, మరో రెండు నెలల్లో మందార మొక్కలను కూడా సరఫరా చేస్తామని తెలిపారు. రానున్న రోజుల్లో బత్తాయి, నిమ్మపై కూడా ప్రయోగాలు చేయనున్నట్లు పేర్కొన్నారు. సాధారణంగా రెండు మూడు రకాలతో అంట్లు నాటుతారని, కానీ తాము ఏకంగా 20 రకాలతో మొక్కలను తయారు చేస్తున్నామని వివరించారు. ఈ విధానంతో నచ్చిన పండ్లు, పూలు ఇళ్ల వద్దే అందుబాటులో ఉంటాయని వివరించారు.

ఏడాది మొత్తం కాసే మామిడి చెట్లు- తుపాను వచ్చినా రాలవట! విదేశాల్లోనూ ఫుల్ డిమాండ్- కేజీ ధర? - Special Mango Tree in Rajasthan

మామిడి చెట్టు కొమ్మకు ఒకే చోట 55 కాయలు, ఎక్కడంటే? - 55 Mangoes In a Single Branch

Last Updated : Oct 18, 2024, 1:59 PM IST

ABOUT THE AUTHOR

...view details