Diaphragm Rare Surgery Done in Hyderabad :పుట్టుకతోనే డయాఫ్రం నిర్మాణ లోపం ఉన్న 3 రోజుల శిశువుకు అరుదైన సర్జరీతో వైద్యులు పునర్జన్మ ప్రసాదించారు. బంజారాహిల్స్‌లోని లిటిల్ స్టార్ చిన్న పిల్లల ఆసుపత్రి వైద్య బృందం దాదాపు నాలుగు గంటల పాటు శ్రమించి ఈ చికిత్స చేసింది. ఆసుపత్రికి చెందిన వైద్యులు సీనియర్ నియోనటాలజిస్టు డాక్టర్ సతీష్ చికిత్సకు సంబంధించి వివరాలను గురువారం మీడియాకు వెల్లడించారు.
సౌదీ అరేబియాలో ఉంటున్న హైదరాబాద్‌కు చెందిన ప్రవాస భారతీయుడు సయ్యద్ హైదర్ హుస్సేన్ నాసిర్ తన భార్య ప్రసవం కోసం గత నెల ఇక్కడకు వచ్చారు. నెలవారీ పరీక్షల్లో భాగంగా శిశువుకు నాలుగో నెలలో డయాఫ్రం నిర్మాణం సక్రమంగా లేదని వైద్యులు గుర్తించారు. లిటిల్ స్టార్ ఆసుపత్రి వైద్యులను సంప్రదించగా, పరీక్షించిన వైద్యులు శిశువులో డయాఫ్రం సక్రమంగా అభివృద్ధి చెందలేదని తెలిపారు.
డయాఫ్రకూటిక్ హెర్నియాగా : డయాఫ్రం అనేది ఛాతీకి, ఉదరకోశానికి మధ్యలో అడ్డుగా ఉంటుంది. దీనివల్ల పొట్టలోని పేగులు, కిడ్నీలు, కాలేయం, ప్లీహం తదితర భాగాలన్నీ ఛాతీలోపలికి రాకుండా ఈ భాగం కాపాడుతుంది. తల్లి గర్భంలో ఉన్నప్పుడే శిశువుల్లో ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. వైద్య పరిభాషలో దీన్ని డయాఫ్రకూటిక్ హెర్నియాగా పిలుస్తారు. కారణాలు తెలియనప్పటికీ ప్రతి 10 వేల మందిలో ఒక శిశువుకి ఈ సమస్య వస్తోంది. ఫలితంగా గుండె, ఊపిరితిత్తులపై తీవ్ర ఒత్తిడి పడి, ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది.