Dharmapuri Arvind Comments On HYDRA :లౌకిక పార్టీ అని చెప్పుకొంటున్న కాంగ్రెస్ 'సెక్యులర్ హైడ్రాను' నడిపించాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ డిమాండ్ చేశారు. కబ్జా నిర్మాణాలను ఎంపిక చేసి కూల్చడం మాత్రమేకాకుండా ప్రణాళికాబద్దంగా నేలమట్టం చేయాలని సూచించారు. రెండు రోజులకోసారి హైడ్రా విధానం మారకూడదని అర్వింద్ హితవు పలికారు. హైడ్రా పాత బస్తీకి వెళ్లడానికి వెనకడుగు వేస్తుందని ఆరోపించారు.
విమోచన దినోత్సవం నిర్వహించాలని డిమాండ్ :అసెంబ్లీలోని బీజేపీ శాసనసభాపక్ష కార్యాలయంలో ఎల్పీసమావేశం నిర్వహించారు. ఎల్పీనేత మహేశ్వర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి రాజాసింగ్ మినహా బీజేపీ ఎమ్మెల్యేలంతా హాజరయ్యారు. ప్రత్యేక ఆహ్వానితులుగా ఎంపీలు హాజరయ్యారు. ఈ సమావేశంలో పది అంశాలపై చర్చించినట్లు పార్టీ శాసనసభాపక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. అర్హులకు రేషన్ కార్డులు, సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.
శ్వేతపత్రం విడుదల చేయాలి :రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఈ నెల 20న 'రైతు దీక్ష' చేయాలని నిర్ణయించినట్లు మహేశ్వర్ రెడ్డి వెల్లడించారు. వరద ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో 'శ్వేతపత్రం' విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా కేంద్రాన్ని నిందించడం సబబు కాదని హితవు పలికారు.