Devadula Project Pipeline Leak :హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పెద్దకోడపాక శివారులో దేవాదుల పైప్లైన్ గేట్ వాల్ లీకై భారీగా నీరు ఎగిసిపడుతూ వృథాగా పోతుంది. చుట్టూ పంట పొలాల్లోకి భారీగా నీరు చేరుతుంది. వరి పంట పొలాలు కోత దశలోకి రావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పొలానికి సమీపంలోనే విద్యుత్ వైర్లు ఉండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి, మరమ్మతు పనులు చేయాలని కోరుకుంటున్నారు.
"దేవాదుల పైప్లైన్ లీక్ అవ్వడం వల్ల సుమారు 30 ఎకరాల్లో పంటంతా నాశనం అయింది. రేపోమాపో వరి కోత చేద్దామనుకుంటే ఇంతలోనే పంటంతా ఆగమాగం అయింది. నీరు పెద్దఎత్తున ఎగిసి పడుతోంది. పొలమంతా జలమయమైంది. పొలానికి సమీపంలోనే విద్యుత్ లైన్ కూడా ఉంది. ఏదైనా ప్రమాదం జరిగి ప్రజలు చనిపోతే ఎవరు బాధ్యత వహిస్తారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాం" -రైతు
పొలంలోకి చేరిన వరదనీరు :పైప్ లైన్ లీకై తమ పొలంలోని కోత దశకు వచ్చిన పంటంతా నాశనం అయిందని మరో రైతు వాపోయారు. వరద నీరంతా పొలం నుంచే పోతుందని, చేతికి అందివచ్చిన పంటంతా దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా పైప్లైన్ లీకై పెద్ద ఎత్తున ఎగిసి పడుతుండడంతో అటువైపుగా వెళ్తున్న వారు ఆశ్చర్యంగా తిలకిస్తున్నారు.