Indiramma Houses Scheme in Telangana : రేషన్ కార్డు లేని వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రేషన్ కార్డు లేకపోయినా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని స్పష్టం చేసింది. మొదటి విడతలో వీరికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని స్వయంగా రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. రేషన్ కార్డు లేని పేద ప్రజలకు ఇది నిజంగా శుభవార్తనే చెప్పాలి. ఖమ్మం జిల్లా కూసుమంచిలోని క్యాంప్ కార్యాలయంలో సోమవారం జరిగిన నియోజకవర్గ పరిధి సమావేశంలో ఈ ప్రకటన చేశారు. తిరుమలాయపాలెం మండలం కాంగ్రెస్ శ్రేణులు, అధికారుల సంయుక్త సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశం అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మొదటి విడతలో పేదలు, నిరుపేదల విభాగాలుగా పరిశీలించి ఇళ్లు మంజూరు చేయాలని నిర్ణయించామని తెలిపారు. రెండో విడత నుంచి మాత్రం రేషన్‌కార్డే ప్రామాణికంగా తీసుకుంటామని స్పష్టం చేశారు. త్వరలోనే రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. గ్రామాల్లో వృద్ధాప్య, దివ్యాంగులు, వితంతువులు తదితర పింఛనుకు అర్హులను గుర్తించి తమ దృష్టికి తీసుకురావాలని అధికారులకు మంత్రి పొంగులేటి సూచించారు.
అర్హులైన వారు ఎంతమంది ఉన్నా పింఛను ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. అదే సమయంలో అనర్హులైన వారికి ఒక్కరికి పింఛన్ ఇచ్చినా ఇబ్బంది పడాల్సి వస్తుందని మంత్రి హెచ్చరించారు. ఈ క్రమంలోనే రేషన్ కార్డు లేనివారికి ఇందిరమ్మ ఇళ్లు మొదటి విడతలో మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. రెండో విడత నుంచి ఆ అవకాశం ఉండదన్నారు.
నాలుగు దశల్లో బిల్లులు మంజూరు :
- మహిళల పేరిటే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు
- లబ్ధిదారులు ఇళ్లను తమకు నచ్చిన డిజైన్‌లో కట్టుకోవచ్చు
- కచ్చితంగా కనీసం 400 చదరపు అడుగుల్లో వంట గది, బాత్రూం, పడక గది ఉండాలి.
- నాలుగు విడతల్లో లబ్ధిదారులకు రూ.5 లక్షలు గ్రీన్ ఛానెల్ ద్వారా చెల్లింపు
- పునాది పూర్తికాగానే రూ.లక్ష
- గోడలు నిర్మాణం అయ్యాక రూ.1.25 లక్షలు
- స్లాబ్ టైంలో రూ.1.75 లక్షలు
- నిర్మాణం పూర్తి అయితే మరో రూ.1 లక్ష
- బ్యాంకు అకౌంట్ ద్వారానే లబ్ధిదారులకు నిధులు జమ
ఇందిరమ్మ ఇళ్లు అప్టేడ్: తొలి దశలో వీరికి మాత్రమే ఛాన్స్ - రూ.5 లక్షలు ఇచ్చేది అప్పుడే
తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్ - దీపావళి కానుకగా ఇందిరమ్మ ఇళ్లు - ఆరోజే స్టార్ట్!