Virat Kohli Birthday Special : క్రికెట్లో పరుగుల యంత్రం అంటే వెంటనే గుర్తొచ్చేది టీమ్ఇండియా బ్యాటర్ విరాట్ కోహ్లీ. గత 16 ఏళ్లుగా విరాట్ ప్రపంచ క్రికెట్‌ను ఏకచక్రాధిపత్యంగా ఏలుతున్నాడు. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా అదరగొడుతున్నాడు. సచిన్ తర్వాత రికార్డుల రారాజుగా పేరొందాడు. ఛేజింగ్‌లో అయితే ఇక విశ్వరూపమే అని చెప్పాలి. అయితే ఈ రోజు(నవంబరు 5)న విరాట్ 36వ పడిలోకి అడుగుపెట్టాడు. ఈ క్రమంలో ఫ్యాన్స్ విరాట్‌కు శుభాకాంక్షలు చెబుతున్నారు. కెరీర్ మరింత రాణించాలని కామెంట్లు పెడుతున్నారు.
ప్రత్యర్థి రెచ్చగొడితే వారికి చుక్కలే!
ఏ దేశంలో ఆడినా, పిచ్ ఎలాంటిదైనా, అవతల ఉన్నది ఎంతటి దిగ్గజ బౌలర్ అయినా కోహ్లీకి లెక్క ఉండదు. క్రీజులో అడుగుపెట్టాడంటే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలే. అలుపు సలుపు లేకుండా పరుగులు స్కోర్ చేయడమే అతడి పని. అందరూ ఇబ్బంది పడే ఛేదనలో మొనగాడిలా నిలబడి జట్టును గెలిపిస్తాడు. మామూలుగా ఒత్తిడి ఎక్కువైతే ఎలాంటి బ్యాటర్ అయినా తడబడతాడు. కానీ ఎంత ఒత్తిడి ఉంటే అంతగా రెచ్చిపోవడం అతడికే సాధ్యమవుతుంది. కోహ్లీని ఎవరైనా రెచ్చగొడితే, తనలోని అత్యుత్తమ ఆటగాడు బయటికి వచ్చేస్తాడు. అందుకే వేరే జట్ల మాజీ ఆటగాళ్లు, కోహ్లీతో పెట్టుకోవద్దని, అతణ్ని రెచ్చగొట్టొద్దని తమ ఆటగాళ్లకు సూచిస్తుంటారు. అంతలా ప్రమాదకరంగా మారిపోతాడు కింగ్ కోహ్లీ.
సచిన్ కంటే దూకుడుగా
వన్డేల్లో సచిన్ సెంచరీల రికార్డును కింగ్ కోహ్లీ బద్దలుకొట్టాడు. సచిన్ 463 వన్డేల్లో 49 సెంచరీలు చేయగా, విరాట్ కేవలం 295 మ్యాచ్‌ల్లోనే 50 శతకాలు బాదాడు. అలాగే ప్రపంచవ్యాప్తంగా వన్డేల్లో ఎక్కువ సెంచరీలు చేసిన ఆటగాడిగా కోహ్లీ ప్రస్తుతం ఉన్నాడు. వన్డేల్లో సచిన్ సగటు 44కాగా, కోహ్లీది ఏకంగా 58. అంతలా కోహ్లీ వన్డేల్లో నిలకడగా రాణించాడు.
ఛేజింగ్‌లో చిచ్చరపిడుగు
అయితే మొదట బ్యాటింగ్ చేస్తున్నప్పటి కంటే ఛేజింగ్‌లో విరాట్ రెచ్చిపోతాడు. ఛేజింగ్లోనే విరాట్ రన్స్, శతకాలు, సగటు ఎక్కువగా ఉన్నాయి. విజయవంతమైన ఛేదనల్లో కోహ్లీ సగటు 90కి పైనే. అన్ని వన్డే ఛేదనల్లో కలిపి కోహ్లీ 27 శతకాలు సాధించాడు. భారత్ తొలుత బ్యాటింగ్ చేసినప్పుడు 23 శతకాలు చేశాడు. స్వదేశంలో 24 సెంచరీలు సాధించిన కోహ్లీ, విదేశాల్లో 26 సార్లు మూడంకెల స్కోరు చేయడం విశేషం. సచిన్ మొత్తంగా 100 అంతర్జాతీయ శతకాలు సాధించగా, కోహ్లీ ప్రస్తుతం 80 సెంచరీలపై ఉన్నాడు. మధ్యలో రెండు మూడేళ్లు సెంచరీలు లేక ఇబ్బంది పడ్డాడు కానీ, లేదంటే సచిన్‌కు మరింత చేరువగా ఉండేవాడే. అయినప్పటికీ ఇంకో మూణ్నాలుగేళ్లు అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగితే సచిన్ వంద శతకాల రికార్డును కూడా అందుకోవడం కష్టమేమీ కాకపోవచ్చని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ప్రత్యర్థులను హడలెత్తించే ఛేజ్ మాస్టర్- కోహ్లీ కెరీర్లో 5 బెస్ట్ నాక్స్ ఇవే!
కోహ్లీ ఫుడ్ డైట్ ఇదే - విరాట్ మాంసాహారం తినడం ఎప్పుడు మానేశాడో తెలుసా?