ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏపీలో పర్యాటక అభివృద్ధికి సహకరించండి - ప్రధాని మోదీతో భేటీకానున్న పవన్‌ కల్యాణ్ - డిప్యూటీ సీఎం పవన్‌ పర్యటన

దిల్లీలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సుడిగాలి పర్యటన - ప్రధాని మోదీతో నేడు సమావేశం

Deputy CM Pawan Kalyan Delhi Tour
Deputy CM Pawan Kalyan Delhi Tour (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 27, 2024, 10:38 AM IST

Deputy CM Pawan Kalyan Delhi Tour : దిల్లీలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఆరుగురు కేంద్రమంత్రులతో భేటీ అయ్యి అనేక అంశాలను వారి దృష్టికి తీసుకెళ్లారు. గ్రామీణ రోడ్ల అభివృద్ధికి చేయూతనివ్వాలని, జలజీవన్‌ మిషన్‌ గడువు పొడిగించాలని, ఏపీలో పర్యాటకాభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌తోనూ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. నేడు ప్రధాని మోదీతోనూ పవన్‌ భేటీకానున్నారు.

జాతీయ పర్యాటక విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పండి :ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ మంగళవారం దిల్లీలో పర్యటించారు. తొలుత పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి గజేంద్రసింగ్‌ శెకావత్ దృష్టికి పవన్‌ కల్యాణ్‌ ఏడు అంశాలను తీసుకెళ్లారు. కేంద్ర పర్యాటక శాఖ ‘స్పెషల్‌ అసిస్టెన్స్‌ టూ స్టేట్‌ క్యాపిటల్‌ ఇన్వెస్టిమెంట్‌ ప్యాకేజీ కింద రాష్ట్రం ప్రతిపాదించిన గండికోట, అఖండ గోదావరి, సూర్యలంక బీచ్‌లకు 250 కోట్లు వెంటనే విడుదల చేయాలని కోరారు. అరకు, లంబసింగిల్లో ఎకో టూరిజం, ఎడ్వెంచర్‌ కేటగిరీలోకి వచ్చే పర్యాటక ప్రాజెక్టులు అభివృద్ధి చేయాలన్నారు.

గోదావరి బ్యాక్‌ వాటర్‌లో హౌస్‌బోట్లు, నది తీరంలో చక్కటి వసతి ఏర్పాట్లతో కోనసీమ అభివృద్ధికి చేయూతనివ్వాలన్నారు. ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలాన్ని ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వ ‘ప్రసాద్‌’ పథకంలో అరసవల్లి, మంగళగిరి ఆలయాలను చేర్చాలని విజ్ఞప్తి చేశారు. అమరావతిలో నిర్మించతలపెట్టిన అత్యాధునిక పర్యాటక భవన్‌కు కేంద్ర పర్యాటక శాఖ ఎంవోటీగా 80 కోట్లు విడుదల చేయాలన్నారు.

కేంద్ర ప్రభుత్వ గ్లోబల్‌ పర్యాటక మార్కెటింగ్‌లో ఏపీని తప్పనిసరిగా ప్రమోట్‌ చేయాలని కోరారు. పర్యాటక రంగంలో విద్యార్థులకు నైపుణ్యాలను అందించేలా జాతీయ పర్యాటక విశ్వవిద్యాలయాన్ని ఏపీలో నెలకొల్పాలని వినతిపత్రం అందించారు. రాష్ట్రంలో బ్లూఫాగ్‌ బీచ్‌లు పెంచడానికి కేంద్రం నిధులిచ్చి సహకరించాలని కోరారు.

గ్రామీణ రహదారుల అభివృద్ధి :తర్వాత కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి సీఆర్‌పాటిల్‌ను కలిసి ఏపీలో జల్‌జీవన్‌ మిషన్‌ పథకం అమలు కాలాన్ని 2027 వరకు పొడిగించాలని కోరారు. 2019-24 మధ్య అందించిన కనెక్షన్లలో కుళాయిల సామర్థ్యం, నీటి నాణ్యత అంశంలో ఇటీవల సర్వే నిర్వహించినట్లు కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. 29.79 లక్షల కుటుంబాలకు కుళాయి కనెక్షన్లు అందలేదని, 2.27 లక్షల పంపులు పని చేయడం లేదని గుర్తించినట్లు చెప్పారు.

చంద్రబాబు నాయకత్వంలో ఏపీ ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందుతుంది : పవన్ కల్యాణ్

గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మ్యాచింగ్‌ గ్రాంట్‌ ఇవ్వకపోవడం వల్ల ఈ పథకంలో 2 వేల కోట్ల రూపాయలే ఏపీ వాడుకుందని, ఇంకా 16 వేల కోట్లు వాడుకోవాల్సి ఉందన్నారు. ఆ నిధులు ఉపయోగించుకోవడానికి సహకరించాలని కోరారు. తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయిన పవన్‌ ఏపీలో గ్రామీణ రహదారుల అభివృద్ధికి ఏషియన్‌ ఇన్‌ఫ్రాస్టక్చ్రర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ నుంచి తీసుకునే రుణంలో వెసులుబాట్లు కల్పించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు. ఏఐఐబీ నుంచి తీసుకున్న రుణానికి ప్రాజెక్టు గడువును రహదారి ప్రాజెక్ట్‌ పూర్తి చేసేందుకు ఇచ్చిన గడువును 2026 డిసెంబర్‌ వరకు పొడిగించాలని కోరారు. ఇందుకోసం బిల్లులు రీయింబర్స్‌మెంట్‌ పద్ధతిలో కాకుండా ముందుగానే చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ఏఐఐబీ గతంలో ఒప్పుకున్న ప్రకారం 3 వేల 834.52 కోట్ల రూపాయలు మంజూరు చేసేలా చూడాలని విన్నవించారు.

లాతూరు నుంచి తిరుపతికి రైలు :పిఠాపురంలో రైల్వే లెవెల్‌ క్రాసింగ్‌ స్థానంలో ఆర్వోబీని ప్రధానమంత్రి గతిశక్తి కార్యక్రమం ద్వారా మంజూరు చేయాలని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసి కోరారు. పిఠాపురంలోని శ్రీపాద వల్లభస్వామి దేవాలయానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం నాందేడ్‌ - సంబల్పూర్‌ నాగావళి ఎక్స్‌ప్రెస్, నాందేడ్‌- విశాఖపట్నం సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్, విశాఖపట్నం- సాయినగర్‌ షిర్డీ ఎక్స్‌ప్రెస్, ఏపీ ఎక్స్‌ప్రెస్‌లకు పిఠాపురంలో హాల్ట్‌ ఇవ్వాలని కోరారు. ఇటీవల ఎన్నికల ప్రచారంలో మహారాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చిన విధంగా లాతూరు నుంచి తిరుపతికి రైలు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.

గిరిజనుల్లా ఒక్కరోజైనా గడపాలనుకుంటున్నారా? - పెళ్లి కూడా చేసుకోవచ్చు!

2021 నుంచి నిధులు అందలేదు :జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా నిర్మిస్తున్న సీసీ రోడ్లు, డ్రెయిన్లు, అంగన్‌వాడీ, వ్యవసాయ ఉత్పత్తుల గిడ్డంగులు, మహిళా స్వయం సహాయక సంఘాల భవనాలకు అంచనా వ్యయం నిధులను పెంచాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌కు పవన్ విజ్ఞప్తి చేశారు. గ్రామీణ సడక్‌ యోజన కింద గ్రామాల్లోని అంతర్గత దారులు కూడా బాగు చేసుకునేందుకు అవకాశం కల్పించాలన్నారు. 100 జనాభా దాటిన గ్రామాలకు సైతం అనుసంధాన రోడ్లు వేసుకునేందుకు పథకంలో చోటు కల్పించాలన్నారు. రాష్టీయ్ర గ్రామ్‌ స్వరాజ్‌ అభియాన్‌ ప్రోగ్రాం కింద కేంద్రం నుంచి రాష్ట్రానికి 2021 నుంచి నిధులు అందలేదని, వాటిని వెంటనే విడుదల చేయాలని కేంద్ర పంచాయతీరాజ్‌ మంత్రి రాజీవ్‌రంజన్‌సింగ్‌ను పవన్‌ కోరారు.

ప్రధాని మోదీతో భేటీ :ఆ తర్వాత ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌తో పవన్‌కల్యాణ్‌ సమావేశం అయ్యారు. నేడు పార్లమెంట్‌లోని కార్యాలయంలో ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా జలజీవన్‌ మిషన్‌ అమలులో రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఆ పథకం కాలపరిమితిని పొడిగించాల్సిన అంశాలపై విజ్ఞప్తి చేయనున్నారు. ఆ తర్వాత కేంద్ర పర్యావరణ అటవీశాఖమంత్రి భూపేందర్‌ యాదవ్‌తోనూ పవన్‌ సమావేశమయ్యే అవకాశం ఉంది.

పోలీసులను వారి పనులను చేసుకోనివ్వండి - నా పని నేను చేస్తా : దిల్లీలో పవన్ కల్యాణ్

అధికారులకు వార్నింగ్ ఇస్తే సుమోటోగా కేసులు- మాది మెతక ప్రభుత్వం కాదు: పవన్‌ కల్యాణ్

ABOUT THE AUTHOR

...view details