Dy CM Bhatti Vikramarka Reviews Implementation of SC and ST Sub Plan : ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం ప్రకారం నిధులు ఖర్చు చేయాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. శాఖల వారీగా ఖర్చుల వివరాలు ప్రతినెలా వెల్లడించాలన్నారు. ఎస్టీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం అమలు తీరుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇవాళ సమీక్ష నిర్వహించారు. సబ్ ప్లాన్ నిధులను పూర్తిస్థాయిలో వినియోగించాలని ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో ఆదాయం పెరిగేలా, ఆస్తులు మరింత సమర్థవంతంగా నిర్వహించేలా అధికారులు ప్రణాళికలు తయారు చేయాలని భట్టి విక్రమార్క ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ పై ఈనెల 23న సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు.
సబ్ ప్లాన్ చట్టం కోటా ప్రకారం ఇప్పటివరకు నిధులు ఖర్చు చేయని శాఖల అధికారులు రాబోయే రెండు నెలల్లో లక్ష్యాన్ని చేరుకునేందుకు ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారో తెలపాలని భట్టి విక్రమార్క ఆదేశించారు. సెస్ అధికారులు అధ్యయనం చేసి తమ నివేదికలను ఆర్థిక, ప్రణాళిక శాఖలకు అందచేసి తరచూ సమావేశం కావాలని ఆదేశించారు. అటవీ భూముల్లో సోలార్ పవర్ ద్వారా మోటార్లు వినియోగించడం అక్కడ వెదురు, అవకాడో, పామాయిల్‌తో పాటు అంతర పంటల సాగు ప్రాజెక్టులు డిజైన్ చేయాలని అధికారులను ఉపముఖ్యమంత్రి ఆదేశించారు.