Deputy CM Bhatti Review On Gurukula Institutions :రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది 5వేల కోట్ల రూపాయలతో 30 ప్రాంతాల్లో 120 గురుకుల పాఠశాల భవనాలు నిర్మించనున్నట్లు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. సమీకృత గురుకుల సముదాయాల కోసం నియోజకవర్గాల్లో స్థలాలు, డిజైన్ల ఎంపిక వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఉపముఖ్యమంత్రి ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో 15 నుంచి 25 ఎకరాలు, పట్టణాల్లో 10 నుంచి 15 ఎకరాలు సేకరించాలన్నారు. ఎనిమిది నెలల్లోనే ఈ భవనాలను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఉపముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
సచివాలయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల ఉన్నతాధికారులతో భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం వందశాతం అడ్మిషన్లు పూర్తి చేయాలని భట్టి విక్రమార్క తెలిపారు. ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాల్లో చదువుతున్న ప్రతీ విద్యార్థి మంచంపైనే పడుకునేలా చర్యలు తీసుకోవాలని, వెంటనే నిధులు మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఉపముఖ్యమంత్రి ఆదేశించారు.
Congress Govt Focus On Gurukul Issues :టాయిలెట్లు, బాత్ రూంలు, మంచినీరు, విద్యుత్ సదుపాయం, తలుపులు, కిటికీలు, దోమతెరలు తదితర వివరాలను హాస్టళ్లు, గురుకులాల్లో ప్రదర్శించాలన్నారు. గురుకులాల్లో అవసరమైన సదుపాయాలపై ఈనెల 29లోగా నివేదిక సమర్పించాలని విద్యాశాఖకు డిప్యూటీ సీఎం ఆదేశించారు. విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్షిప్ రెండో విడత నిధులను వెంటనే విడుదల చేయాలన్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వినతిపై డిప్యూటీ సీఎం సానుకూలంగా స్పందించారు.