Bhatti and Tummala on Crop Loan Waiver with Bankers :రాష్ట్రంలో వ్యవసాయ రంగం, రైతాంగం బలోపేతం విషయంలో లెక్కలు కాదు ఆత్మపరిశీలన ఉండాలని, కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ పథకం కోసం 18 వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు చేర్చామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. రైతులకు మాత్రం నేటి వరకు 7500 కోట్ల రూపాయలు మాత్రమే చేరాయని తెలిపారు. హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి సమావేశానికి డిప్యూటీ సీఎం ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆర్థిక సంవత్సరం రుణ లక్ష్యాలు, గత ఏడాది సాధించిన పురోగతి, రుణమాఫీ పథకం కింద నిధుల కేటాయింపులు వంటి అంశాలపై చర్చించారు. 2024-25 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ప్రాధాన్యత రంగాల అడ్వాన్సుల విషయంలో వివిధ విభాగాల్లో బ్యాంకులు సానుకూల పనితీరు కనపరచడం పట్ల భట్టి సంతోషం వ్యక్తం చేశారు. మొదటి త్రైమాసికంలోనే ప్రాథమిక రంగం కింద బ్యాంకుల్లో 40.62 శాతం వార్షిక రుణ ప్రణాళికలో భాగంగా లక్ష్యం సాధించడం అభినందనీయమన్నారు.
రాష్ట్రానికి వెన్నెముకగా వ్యవసాయ రంగం :రాష్ట్రం నగదు నిల్వల నిష్పత్తి మొదటి త్రైమాసికంలో 127. 29 శాతానికి మెరుగుపడడం మరో ఆసక్తికరమైన అంశమని భట్టి విక్రమార్క తెలిపారు. రాబోయే త్రైమాసికంలో నిర్దేశించిన రుణ ప్రణాళికను అధిగమించేందుకు బ్యాంకర్లు కృషి చేస్తారని ఆశిస్తున్నానంటూ దిశానిర్దేశం చేశారు. ప్రత్యామ్నాయ పంటల ప్రోత్సాహంలో భాగంగా ఆయిల్‌పామ్ సాగుకు మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు.
గ్రామీణ ప్రాంతాలను వేగంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించిన క్రమంలో ఇప్పటికే రీజినల్ రింగ్ రోడ్డు నిర్మిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి చెప్పారు. వ్యవసాయ రంగం రాష్ట్రానికి వెన్నెముకగా భావిస్తున్న సర్కారు, రుణమాఫీ, రైతుభరోసా ద్వారా పెట్టుబడి సాయం, భారీ మధ్యతర సాగునీటి ప్రాజెక్టుల పూర్తి కోసం నిధులు కేటాయిస్తున్నామన్నారు. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో బృందం అమెరికా, కొరియా దేశాల్లో పర్యటించి 36 వేల కోట్ల రూపాయల విలువైన ఎంఓఏలు కుదుర్చుకున్నారని చెప్పుకొచ్చారు.