Deputy Cm Bhatti On Lok Sabha Polls Result 2024: లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో 12 నుంచి 14 పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకుంటుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడగానే ఈ దేశ ప్రజల కోసం అనేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు. ఇవాళ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ధన్వాడ గ్రామంలో శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు దర్శించుకున్నారు.
శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయ 3వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ శ్రీ దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకోవడం ఎంతో ఆనందదాయకమని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కార్యకర్తలు అహర్నిశలు కష్టపడ్డారని తెలిపారు. ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్లో పాల్గొనడం శుభ పరిణామన్నారు.
కలిసొచ్చిన రేవంత్ ప్రచారం - డబుల్ డిజిట్ ఖాయమని కాంగ్రెస్ అంచనా - CONGRESS ON LOK SABHA WINNING
శ్రీ దత్తాత్రేయ స్వామి దేవాలయంలో పూజలు: రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్వగ్రామమైన ధన్వాడలో స్వంతంగా నిర్మించిన శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయం మూడో వార్షికోత్సవ పూజలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భట్టి విక్రమార్కతో పాటు ఎమ్మెల్యేలు విజయరమణ రావు, మక్కాన్ సింగ్, ప్రేమ్ సాగర్ రావు, అడ్డూరి లక్ష్మణ్ కుమార్, గండ్ర సత్యనారాయణ రావులతో పాటు ఇతర నేతలు పాల్గొన్నారు.