Deesawala Rubber Industries Inaugurated New Plant in Medchal : రబ్బర్ సీలింగ్ రింగ్‌లు, రబ్బర్ గ్యాస్‌కెట్లు, ఇతర రబ్బర్ ఉత్పత్తుల తయారీ చేస్తున్న దీసవాలా రబ్బర్ ఇండస్ట్రీస్, వ్యాపార విస్తరణలో భాగంగా కొత్త ప్లాంట్‌ను నిర్మించింది. మేడ్చల్ సమీపంలోని కాళ్లకల్‌లో 40,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో కంపెనీ నాలుగో తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసింది. అత్యాధునిక యంత్రాలు, ల్యాబ్ టెస్టింగ్ సదుపాయంతో దీనిని నెలకొల్పామని యాజమాన్యం తెలిపింది.
నూతన ప్లాంట్ వల్ల పెరగనున్న ఉత్పత్తి : ఇప్పటి వరకు రోజుకు 7-8 టన్నులు ఉన్న ఉత్పత్తి, ఈ నూతన ప్లాంట్ వల్ల 25 టన్నులకు పెరుగుతుందని సంస్థ ఎండీ హునేద్ దీసవాలా తెలిపారు. ఐదో యూనిట్‌కు సైతం ఏర్పాట్లు జరుగుతున్నాయని, మరో ఏడాదిలో అందులోనూ కార్యకలాపాలు కొనసాగిస్తామని ఆయన వెల్లడించారు. 1996లో ప్రారంభమైన దీసవాలా రబ్బర్ ఇండస్ట్రీస్, రహదారి, వంతెన ప్రాజెక్టులకు ఉపయోగపడే బేరింగ్ ప్యాడ్‌లు, రబ్బర్ స్పీడ్ బ్రేకర్లు, పైప్ గ్యాస్‌కెట్లు, యూపీవీసీ పైపులు, ఆటోమొబైల్, పరిశ్రమల్లో ఉపయోగించే రబ్బర్ సామాగ్రిని తయారు చేస్తోంది.
Deesawala Industries in Hyderabad :రైల్వే ప్రాజెక్టుల్లో ఉపయోగించే రైలు ప్యాడ్‌లు, ఔషధ పరిశ్రమల్లో ఉపయోగించే సిలికాన్ ఉత్పత్తులను తయారు చేస్తున్నామని దీసవాలా రబ్బర్ ఇండస్ట్రీస్ ఈడీ మూర్తజా దీసవాలా తెలిపారు. నాణ్యత, మన్నికైన వస్తువులను ఉత్పత్తి చేయడం వల్లే వినియోగదారుల నుంచి ఆదరణ లభిస్తోందని పేర్కొన్నారు. కంపెనీకి హైదరాబాద్‌లోని బాలానగర్‌లో ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా 3 తయారీ యూనిట్లు ఉన్నాయని ఆయన చెప్పారు.
భారతదేశం ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా ప్రయాణాన్ని ప్రారంభించిందని, అందుకనుగుణంగా రైలు, రోడ్డు, విమానయానం, ఇతర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్‌ల్లో పెట్టుబడులు మరింత ఊపందుకున్నాయని ఎండీ హునేద్ దీసవాలా తెలిపారు. తమ సంస్థ ఈ ప్రతి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులో అవసరమైన ఉత్పత్తులను తయారు చేస్తుందని చెప్పారు. తద్వారా తమకు ఎదగడానికి అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుందని హునేద్ దీసవాలా వివరించారు.