Tungabhadra Dam Repair Works Updates :గల్లంతైన తుంగభద్ర డ్యాం 19వ గేటు స్థానంలో స్టాప్‌లాగ్ ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. నీటిని మరీ క్రస్టుగేట్ల దిగువకు తగ్గించకుండా అంతకన్నా ముందే స్టాప్‌లాగ్ ఏర్పాటు చేయాలని తుంగభద్ర బోర్డు, ఏపీ, కర్ణాటక అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం జలాశయంలో 97 టీఎంసీల నీటినిల్వ ఉంది. గేటు కొట్టుకుపోయిన సమయం నుంచి సోమవారం రాత్రి 9 గంటల వరకు మొత్తం 8 టీఎంసీల నీళ్లు ఖాళీ అయ్యాయి. గడిచిన 24 గంటల్లో జలాశయంలోకి సగటున 25 వేల 571 క్యూసెక్కుల వరద వస్తోంది. 19 గేట్లు ఎత్తి 99 వేల 567 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
తొలుత డ్యాం క్రస్టుస్థాయి 16 వందల 13 అడుగుల వరకు నీటిని వదిలేసి ఆ తర్వాత కొట్టుకుపోయిన గేటు వద్ద స్టాప్‌లాగ్ ఏర్పాటు చేయాలని భావించారు. ప్రస్తుతం అలా కాకుండా క్రస్టుస్థాయి కన్నా ఎగువకు నీళ్లు ఉన్న సమయంలోనే స్టాప్‌లాగ్ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు. ఇలా చేయడంతో నీటిని పూర్తిగా వృథా చేయకుండా చూడవచ్చనే భావనతో ఉన్నారు. జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ సోమవారం ప్రాజెక్టును సందర్శించి అక్కడి పరిస్థితులను పర్యవేక్షించారు.
స్టాప్‌లాగ్ నిర్మాణ ఖర్చుల కోసం రూ. 5 కోట్లు :ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లిన కేంద్ర ఆకృతుల సంస్థ చీఫ్ ఇంజినీర్ తోట కుమార్ బృందం కూడా బోర్డు అధికారులతో మాట్లాడింది. కొత్త స్టాప్‌లాగ్ డిజైన్లు సహా ఇతర అంశాలు పరిశీలించింది. కొట్టుకుపోయిన గేటు వద్ద స్టాప్‌లాగ్ ఎలిమెంట్లు ఏర్పాటు చేసేందుకు హొసపేటె సమీపంలోని ఓ వర్క్‌షాప్‌లో వాటి ఫ్యాబ్రికేషన్ సాగుతోంది. మొత్తం 5 ప్లేట్లలా తయారుచేస్తున్నారు. అందులో తొలుత మూడు ప్లేట్లు ఏర్పాటు చేస్తారు. 2 రోజుల్లో వీటి తయారీ పూర్తవుతుందని ఏపీ అధికారులు తెలియజేశారు. మూడు ప్లేట్ల ఏర్పాటు పూర్తయిన తర్వాత మళ్లీ 2 రోజుల గడువు ఇచ్చి మరో 2 ప్లేట్లతో కొట్టుకుపోయిన గేటు ఖాళీ ప్రదేశాన్ని పూర్తిగా మూసివేస్తారు.