Dammalapati Srinivas Take Charge AG in AP :ఏపీ నూతన అడ్వకేట్ జనరల్‌గా సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టులో బాధ్యతలు చేపట్టారు. ఏజీ కార్యాలయంలో పూజ నిర్వహించి బాధ్యతలను స్వీకరించారు. ఆయనను ఏజీగా నియమిస్తూ ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే . ఈ కార్యక్రమంలో పలువురు హైకోర్టు న్యాయవాదులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. శ్రీనివాస్ ఏజీగా నియమితులవడం ఇది రెండోసారి.
ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కంచికచర్లలో నాగేశ్వరరావు, విజయలక్ష్మి దంపతులకు దమ్మాలపాటి శ్రీనివాస్ జన్మించారు. 1991లో వెలగపూడి దుర్గాంబ సిద్ధార్థ న్యాయ కళాశాల నుంచి న్యాయశాస్త్రంలో పట్టా తీసుకున్నారు. అదే సంవత్సరం బార్ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకుని హైకోర్టులో లాయర్ వృత్తిని ప్రారంభించారు. తర్వాత సీనియర్ న్యాయవాది ఎస్.ఆర్.అశోక్ వద్ద రాజ్యాంగం, క్రిమినల్, పన్నులకు, సివిల్, సంబంధించిన కేసుల్లో ప్రాక్టీస్ చేసి మంచి పేరు గడిచారు.
AP New AG Dammalapati Srinivas :1996 నుంచి 2005 వరకు రైల్వే స్టాండింగ్ కౌన్సిల్‌గా బాధ్యతలు నిర్వహించారు. 1999 నుంచి 2003 వరకు కేంద్ర ప్రభుత్వ అదనపు స్టాండింగ్ కౌన్సిల్‌గా పనిచేశారు. 1996 నుంచి 2002 వరకు ఆదాయపు పన్ను శాఖ జూనియర్ స్టాండింగ్ కౌన్సిల్‌గా విధులు నిర్వర్తించారు. 2000 నుంచి 2005 మధ్య కాలంలో పంచాయతీరాజ్ సంస్థలు, మున్సిపాలిటీలకు స్టాండింగ్ కౌన్సిల్‌గా బాధ్యతలు నిర్వహించారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు స్టాండింగ్ కౌన్సిల్‌గా పనిచేశారు. పలు కార్పొరేట్ సంస్థలకు న్యాయవాదిగా, న్యాయ సలహాదారుగా సేవలు అందించారు.