Police Recovered 1100 Mobiles : సైబరాబాద్ కమిషనరేట్ సెల్ఫోన్ రికవరీలో రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా రూ.3 కోట్ల 30లక్ష ల విలువ చేసే 1100 మొబైల్ ఫోన్లలను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సైబరాబాద్ క్రైం డీసీపీ నర్సింహా వివరాలు వెల్లడించారు.
నెల రోజుల్లోనే రికవరీ : 2023 ఏప్రిల్ 20 నుంచి కేంద్ర ప్రభుత్వం సీఈఐఆర్ ప్రవేశపెట్టారని దీని ద్వారా మొబైల్స్ చోరీ, పోగొట్టుకోనామన్న ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయన్నారు. బాధితులు సీఈఐఆర్లో ఫిర్యాదు చేసుకుంటే ఫోన్ రికవరీ జరుగుతుందన్నారు. ఈరోజు రూ.3కోట్ల 30లక్షల విలువ చేసే 1100 మొబైల్స్ రికవరీ చేయడం జరిగిందన్నారు. ఫోన్ పోతే నెల రోజుల వ్యవధిలోనే రికవరీ అవుతుందని, ఈ సంవత్సరంలో నాలుగో సారి మొబైల్ ఫోన్ రికవరీ అయ్యాయని వివరించారు.
సీసీటీవీలతో నేరాలకు కళ్లెం :సైబరాబాద్ పరిధిలోని 45 పోలీసు స్టేషన్ల సిబ్బంది కష్టం వల్లే ఇదంతా సాధ్యమైందన్నారు. ఈ సంవత్సరం సైబరాబాద్లో 7500 మొబైల్స్ రికవరీ చేయడం జరిగిందన్నారు. ఫోన్ల రికవరీలో సైబరాబాద్ కమిషనరేట్ 2వ స్థానంలో వుందన్నారు. ప్రజలు విలువైన వస్తువులు తీసుకెళ్లేటప్పుడు జాగ్రత్త వహించాలని డీసీపీ సూచించారు. ప్రతి ఒక్కరు తమ ఇళ్లు, షాపులు, వ్యాపార సముదాయాల్లో సీసీటీవీలు అమర్చుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రతి కాలనీలో సీసీటీవీ ఏర్పాటు చేయడం వల్ల నేరాలు అరికట్టగలమని, ఒక్క సీసీటీవీ వంద మందితో సమానం అని అన్నారు.