Indian Cyber Threat Report 2025 :2025 సంవత్సరంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధ) పరిజ్ఞానంతో కూడిన మాల్‌వేర్‌లతో సైబర్ దాడులు ఎక్కువ జరిగే అవకాశముందని ఇండియా సైబర్ థ్రెట్ రిపోర్ట్-2025’ అంచనా వేసింది. ఆ పరిజ్ఞానంతోనే వాటిని నియంత్రించవచ్చని తెలియజేసింది. గడిచిన సంవత్సర కాలంలో దేశం మొత్తంగా ప్రతి సెకనుకు 11 సైబర్ దాడులు జరిగినట్లు గుర్తించింది.
వచ్చే ఏడాదిలో ఏఐ ఆధారంగా సైబర్ మోసాలు : రానున్న రోజుల్లో ఏఐ ఆధారిత మాల్వేర్ల ద్వారా దాడులు జరిపి వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడతారని డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (డీఎస్‌సీఐ), సెక్‌రైట్ అనే సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదిక అంచనా వేసింది.హెల్త్‌కేర్, ఆతిథ్యం, ఫైనాన్స్ వంటి రంగాలపై ఈ దాడుల ప్రభావం ఎక్కువగా ఉందని నివేదిక తెలిపింది. బయోమెట్రిక్ డేటా దోపిడీ మరింతగా పెరుగుతుందని అంచనా వేసింది. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను లక్ష్యంగా చేసుకొని నకిలీ యాప్‌లు, దరఖాస్తుల ద్వా మోసాలకు పాల్పడే అవకాశం ఉందని తెలిపింది.
గతేడాది కాలంలో 36.9 కోట్ల మాల్‌వేర్లతో దాడులు : దేశంలో 2023 అక్టోబరు నుంచి ఈ ఏడాది సెప్టెంబరు వరకు ఏడాది కాలంలో జరిగిన సైబర్ దాడులపై డీఎస్‌సీఐ, సెక్‌రైట్ నివేదికలు ఇచ్చాయి. దేశవ్యాప్తంగా 84 లక్షల ఎండ్‌పాయింట్ల (నేరం జరిగినట్లు గుర్తించిన కేంద్రం)లో 36.9 కోట్ల మాల్‌వేర్లతో దాడులు జరిగినట్లు గుర్తించారు. దీని ఆధారంగా భారత్‌లో నిమిషానికి సగటున 702 సైబర్ దాడులు జరిగాయని తెలిపారు. అంటే ప్రతి సెకనుకు 11 దాడులు జరిగినట్లు పేర్కొన్నారు.
ఇండియన్ సైబర్ థ్రెట్ రిపోర్ట్ :హెల్త్‌కేర్ (21.82%), ఆతిథ్యం (19.57%), బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్- బీఎఫ్‌ఎస్‌ఐ (17.38%), ఎడ్యుకేషన్ (15.64%), ఎంఎస్‌ఎంఈ (7.52%), మాన్యుఫ్యాక్చరింగ్ (6.88%), ప్రభుత్వ సంస్థలు (6.1%), ఐటీ/ఐటీఈఎస్ (5.09%) రంగాలు దాడులకు గురయ్యాయి. ప్రతి 40,436 మోసాల వెనుక ఓ మాల్‌వేర్, సగటున ప్రతి 595 మోసాల వెనుక ఓ ర్యాన్సమ్‌వేర్ ఉన్నట్లు రక్షణ వ్యవస్థల ద్వారా తెలుసుకున్నారు.
ఏడాది కాలంలో 5,842 హ్యాక్టివిస్టులు బృందాలుగా ఏర్పడి హ్యాకింగ్‌కు పాల్పడే సైబర్ నేరగాళ్లను ‘హ్యాక్టివిస్టు గ్రూపులు’గా వ్యవహరిస్తుంటారు. దేశంలో ప్రముఖ సంస్థలను లక్ష్యంగా చేసుకొని ఈ బృందాలు సంవత్సర కాలంలో 5,842 దాడులు చేశాయి. దేశ సరిహద్దులకు కూడా వీటి నుంచి ఈ ముప్పు నెలకొందని నివేదిక వెల్లడించింది.