Cyber Security Bureau Action on Cyber Crimes :సైబర్ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఆఫర్ల పేరుతో లింక్‌లు పంపడం, బహుమతి గెలిచారని మాయమాటలు చెప్పడం, ఆధార్, పాన్, బ్యాంక్ ఖాతాల అప్‌డేట్ అంటూ మోసాలకు పాల్పడుతున్నారు. దీంతో చాలామంది సైబర్ నేరగాళ్ల వలలో పడి తమ జేబులు, బ్యాంకు ఖాతాలు గుల్ల చేసుకుంటున్నారు. సైబర్ నేరాలపై పోలీసులు ఎంతగా అవగాహన కల్పించినా, బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. వీరి ఆగడాలను అరికట్టేందుకు పోలీసు శాఖ నడుం బిగించింది. ఇందులో భాగంగా ఉన్నతాధికారులు సైబర్ సెక్యూరిటీ బ్యూరోను ఏర్పాటు చేశారు.
Telangana Police Focus on Cyber Crimes : ఆధార్ అప్‌డేట్, క్రిప్టో కరెన్సీ, పెట్టుబడులకు లాభం వంటి పేర్లతో ప్రజల ఫోన్లకు వచ్చే అనుమానాస్పద వెబ్ లింకులు, సందేశాలపై సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు ఫిర్యాదు చేయవచ్చు. ఇందుకు ప్రత్యేక వాట్సాప్ నంబర్ 87126 72222 అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ నంబర్‌కు అనుమానాస్పద వెబ్‌లింకులపై ఫిర్యాదు చేస్తే సెక్యురిటీ బ్యూరో పరిశీలించి నకిలీ వెబ్‌లింకులు పని చేయకుండా అడ్డుకుంటోంది. తద్వారా సైబర్ నేరాలను (Cyber Crimes in Telangana) కట్టడి చేయవచ్చు.
అధికారిక వెబ్‌సైట్లకు తీసిపోని విధంగా నకిలీ లింకులు : సైబర్ నేరస్థులు ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థల అధికారిక వెబ్‌సైట్లకు తీసిపోని విధంగా నకిలీ లింకులను తయారు చేసి కస్టమర్ కేర్ పేరుతో ఆన్‌లైన్‌లో నంబర్లను ఉంచుతున్నారు. హరియాణా, ఝార్ఖండ్ మరికొన్ని రాష్ట్రాల్లో రూ.5000లు ఇస్తే అసలు వైబ్‌సైట్ తరహాలో నకిలీవి తయారు చేస్తారు. అక్షరాలు, రంగులు సహా సరిపోయే విధంగా ఇవి ఉంటాయి. ఆన్‌లైన్‌లో అసలైన సంస్థ పేరు టైప్ చేయగానే అధికారిక వెబ్‌సైట్‌కు బదులుగా నకిలీ వెబ్‌సైట్ (Fake Websites) పైభాగంలో కనిపించే విధంగా చేస్తున్నారు. ఇది నిజమని నమ్మి అధిక శాతం మంది నకిలీ వెబ్‌సైట్లు, కస్టమర్ కేర్ల బారిన పడి తమ ఖాతాలు గుళ్ల చేసుకుంటున్నారు.