తెలంగాణ

telangana

ETV Bharat / state

సైబర్ బాధితులను కాపాడే 'గోల్డెన్ అవర్' - ఆ ఒక్క గంట పోయిన మీ డబ్బునంతా తిరిగి ఇప్పిస్తుంది - GOLDEN HOUR OF CYBERCRIME

సైబర్​ క్రైంలో గోల్డెన్​ అవర్ - సైబర్​ నేరం జరిగిన మొదటి గంట సమయమే గోల్డెన్​ అవర్ - మొదటి గంటలోపు ఫిర్యాదు చేస్తే పూర్తి డబ్బు స్వాధీనం చేసుకోవచ్చని చెబుతున్న పోలీసులు

Cyber Crime
Cyber Crime (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 16, 2024, 7:55 AM IST

Updated : Nov 16, 2024, 9:14 AM IST

Cyber Crime : ఏదైనా ప్రమాదం జరిగిన గంటలోపు వైద్యం అందించగలిగితే ప్రాణాలు నిలుస్తాయని వైద్యులు చెబుతారు. అందుకే ప్రమాదం జరిగిన తర్వాత నుంచి మొదలయ్యే మొదటి గంట సమయాన్ని వైద్య భాషలో గోల్డెన్​ అవర్​ అంటారు. ఇప్పుడు ఇదే సూత్రం సైబర్​ నేరాలకు కూడా సైబర్​ నిపుణులు, పోలీసులు వర్తిస్తున్నారు. సైబర్​ నేరం జరిగిన గంటలోపు ఫిర్యాదు చేస్తే సైబర్​ నేరగాళ్లు దోచుకున్న సొమ్మునంతా తిరిగి ఇప్పిస్తారు. ఇప్పుడు ఆ గంట సమయం బాధితుడికి రక్షణగా ఉంటుందని, సైబర్​ నేరం జరిగిన గంటలోనే ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. ఇప్పుడు ఆ గోల్డెన్​ అవర్​ గురించి ప్రాచుర్యత కల్పిస్తున్నారు.

రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్​లో సైబర్​ నేరాలు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాదిలోనే ఇప్పటివరకు రాష్ట్రంలో దాదాపు రూ.1500 కోట్లను సైబర్​కేటుగాళ్లు కొట్టేశారు. అంటే సగటున నెలకు రూ.150 కోట్లన్న మాట. సైబర్​ నేరగాళ్ల బారిన విద్యావంతులు, ఉన్నతాధికారులు, చివరకు పోలీసులూ పడ్డారు. ఈ ఆన్​లైన్​ మోసాలు ఎలా ఉంటున్నాయంటే ఒక తరహా నేరంపై అవగాహన పెరిగే సరికి మరో తరహాలో దాడి జరుగుతుంది. అందుకే పోలీసులు సైబర్​ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా ఒకవైపు ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఒకవేళ నేరగాళ్ల బారిన పడితే ఎలా స్పందించాలో కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

ఆలస్యం అవుతున్న కొద్దీ కొల్లగొట్టిన నగదు దారి మళ్లించే అవకాశాలు పెరిగిపోతాయి. అందుకే నేరం జరిగిన మొదటి గంటలో ఫిర్యాదు చేస్తే నిలిపివేసి, తిరిగి బాధితుడికి చెల్లించే అవకాశాలు మెరుగ్గా ఉంటాయని చెబుతున్నారు. ఈ ఏడాది తెలంగాణలో దాదాపు రూ.100 కోట్ల వరకు ఇలానే తిరిగి ఇప్పించగలిగారు.

ఎలా చేయాలి..? ఏం జరుగుతుంది?

  • సైబర్​ నేరాల కట్టడికి కేంద్ర ప్రభుత్వం ఇండియన్​ సైబర్​ క్రైం కో-ఆర్డినేషన్​ సెంటర్ (ఐ4సీ)​ను ప్రారంభించింది.
  • ఇందులో దర్యాప్తు సంస్థలు, బ్యాంకులు, వివిధ ఆర్థిక సంస్థలను భాగస్వామ్యం చేసింది.
  • బాధితులు ఫిర్యాదు చేసేందుకు దేశవ్యాప్తంగా పని చేసేలా 1930తో ఒక టోల్​ఫ్రీ నంబరును కేటాయించారు.
  • ఈ నంబరుకు ఫోన్​ చేసిన వెంటనే కాల్​ సెంటర్​లోని ఉద్యోగులు బాధితుడి వివరాలు నమోదు చేసుకుంటారు.
  • అంటే బ్యాంకు ఖాతా నంబరు, మోసం చేసేందుకు నేరస్థుడు వాడిన ఫోన్​ నంబరు, మోసం జరిగిన తీరుపై సమాచారాన్ని సేకరిస్తారు.
  • సాధారణంగా కేటుగాళ్లు బ్యాంకు ఖాతా నుంచి కొల్లగొట్టిన డబ్బును మరో బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. సొంత ఖాతాలో జమ చేస్తే చిరునామా తెలిసిపోతుందన్న ఉద్దేశంతో బినామీ ఖాతాలను ఉపయోగిస్తారు.
  • నిరక్షరాస్యులు, నిరుద్యోగులకు డబ్బుల ఆశ చూపించి వారి ఖాతాలను వాడుకుంటారు. మళ్లీ వాటి నుంచి మరికొన్ని ఖాతాల్లోకి మళ్లించి, ఏటీఎంల ద్వారా డ్రా చేసుకుంటారు.
  • లేదంటే క్రిప్టో కరెన్సీగా మార్చి విదేశాలకు పంపుతుంటారు. ఇటీవల ఒక వ్యక్తి నుంచి రూ.2 కోట్లు కొల్లగొట్టిన నిందితులు గంట వ్యవధిలోనే ఆ మొత్తాన్ని దాదాపు 200 ఖాతాల్లోకి మళ్లించారు. కొన్ని ఖాతాలు కేరళలో ఉంటే మరికొన్ని కశ్మీర్​లో ఉంటాయి.
  • ఫిర్యాదు ఆలస్యం అయితే ఈ ఖాతాల సంఖ్య పెరుగుతూ పోతుంది.
  • 1930కి బాధితుడు ఫిర్యాదు చేస్తే ముందుగా అతని ఖాతా ఉన్న బ్యాంకునకు సమాచారం చేరవేస్తారు. ఆ ఖాతా నుంచి నగదు బదిలీని ఆపమని కోరతారు.
  • అప్పటికే ఒకవేళ బదిలీ జరిగినట్లు అయితే ఆ డబ్బు ఏ ఖాతాలో పడిందో తెలుసుకొని ఆ బ్యాంకును అప్రమత్తం చేస్తారు. ఇలా ఎన్ని ఖాతాలకు డబ్బులు పడి ఉంటే అన్ని ఖాతాల బ్యాంకులకు సమాచారం ఇస్తారు.
  • అప్పటికి డబ్బు ఖాతాలోనే ఉంటే తిరిగి రప్పిస్తారు.

ఇటీవల కాలంలో జరిగిన కొన్ని సంఘటనలు :

  • ఇటీవల కాలంలో హైదరాబాద్​కు చెందిన ఓ వ్యక్తిని స్టాక్​ మార్కెట్​లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించి సైబర్​ నేరగాళ్లు రూ.1,22,26,205 కొల్లగొట్టారు. మోసపోయానని తెలుసుకున్న బాధితుడు వెంటనే సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, తక్షణమే స్పందించిన పోలీసులు బ్యాంకు లావాదేవీలు నిలిపివేయడం ద్వారా రూ.1,05,00,000 కాపాడారు. అప్పటికే నేరస్థుడు దాదాపు రూ.17 లక్షలను మళ్లించాడు.
  • ఇంకో కేసులోనూ ఇలానే సైబర్​ నేరగాళ్లు అధిక లాభాలు ఆశ చూపించి ఒకేసారి రూ.11,55,000లను కొల్లగొట్టారు. మోసపోయానని తెలుసుకున్న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేస్తే వెంటనే డబ్బంతా తిరిగి ఇప్పించారు.

సోషల్​ మీడియాలో స్టాక్​​ మార్కెట్​ లింక్​​ ఓపెన్ చేశారు - రూ.3.81 కోట్లు పోగొట్టుకున్నారు - Cyber Crime In Patancheru

సైబర్​ నేరగాళ్లు మీ డబ్బులు దోచుకున్నారా? ఎవరికి, ఎలా ఫిర్యాదు చేయాలో తెలుసా? - How To File Cyber Crime Complaint

Last Updated : Nov 16, 2024, 9:14 AM IST

ABOUT THE AUTHOR

...view details