FedEx Fraud in Hyderabad : ఫెడ్‌క్స్ కొరియర్స్ పేరిట వచ్చే ఫోన్‌లను నమ్మవద్దంటూ పోలీసులు ఎన్ని సార్లు హెచ్చరించినా, కొందరు తరచు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుని మోసపోతూనే ఉన్నారు. తాజాగా హైదరాబాద్ నగరానికి చెందిన 32 ఏళ్ల ప్రైవేట్ ఉద్యోగిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. అతని నుంచి 3.71 లక్షల రూపాయలు కొల్లగొట్టారు. ఓ వ్యక్తి సదరు ఉద్యోగికి ఫోన్ చేసి, ఉద్యోగి పేరు మీద ఫెడెక్స్ కొరియర్‌కు పార్శిల్ వచ్చిందని తెలిపాడు.
పార్శిల్‌లో నకిలీ పాస్‌పోర్టులు, డ్రగ్స్ ఉన్నాయన్నాడు. తాను ముంబయి నేర విభాగం పోలీసులమని చెప్పాడు. దీంతో ఉద్యోగి ఆందోళన చెందాడు. కేటుగాళ్లు అతన్ని భయబ్రాంతులకు గురి చేసి బ్యాంకు ఖాతా నుంచి రూ.3.71 లక్షలు దండుకున్నారు. ఆ తర్వాత తాను మోసపోయినట్టు బాధితుడు గ్రహించి సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు.
సైబర్ ఫిర్యాదుల సంప్రదింపుల కోసం : రంగంలో దిగిన పోలీసులు బాధితుడికి చెందిన 3.71 లక్షల రూపాయలు నేరస్థులు చేతికి చిక్కకుండా స్తంభింపజేశారు. అయితే ఈ తరహా మోసగాళ్ల మాటలు నమ్మి మోసపోవద్దని పోలీసులు సూచించారు. మోసపోయినట్టు గ్రహిస్తే 1930 నెంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాలని, cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని కోరారు. బాధితులు 8712665171 నెంబర్‌కు వాట్సప్ ద్వారా సంప్రదించవచ్చని తెలిపారు.
Cyber Fraud Phone Calls :మరోవైపు ఏకంగా పోలీసుల డీపీలు వాడుకుని వాట్సాప్, నార్మల్ కాల్స్ చేస్తూ అమాయక ప్రజలను బెదిరిస్తూ ఆర్థిక మోసాలకు పాల్పడిన ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. ఈ సైబర్ కేటుగాళ్ల ధాటికి ముఖ్యంగా ఉపాధి కోసం విదేశాలకు వెళ్లినవారు, ఉన్నత చదువుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన విద్యార్థుల కుటుంబాలు బలవుతున్నాయి.