Cyber Fraud on Auto Driver in Nizamabad : నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఓ ఆటో డ్రైవర్ భారీ సైబర్ మోసానికి గురయ్యాడు. నిజామాబాద్ వినాయక్ నగర్లో నివాసం ఉండే సాయిలు అనే ఆటో డ్రైవర్ను సైబర్ నేరగాళ్లు లాటరీ పేరుతో 15 లక్షల 77 వేల రూపాయలు కుచ్చు టోపీ పెట్టారు. గత సంవత్సరం ఏప్రిల్ నెలలో గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి కౌన్ బనేగా కరోడ్ పతి కంపెనీ పేరుతో రూ. 25 లక్షల లాటరీ వచ్చిందని ఆటో డ్రైవర్ను నమ్మించారు. దీంతో ఆ విషయాన్ని నమ్మిన ఆటో డ్రైవర్ వద్ద ఇప్పటి వరకు వివిధ రకాల ఛార్జీల పేరుతో 15 లక్షల 77 వేల రూపాయలు సైబర్ నేరగాళ్లు వసూలు చేశారు. ఈ నేపథ్యంలో మోసపోయానని తెలుసుకున్న బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
Lucky Dip Frauds in Telangana : సైబర్ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఆఫర్ల పేరుతో లింక్‌లు పంపడం, బహుమతి గెలిచారని మాయమాటలు చెప్పి అందినకాడికి దోచుకుంటున్నారు. తాజాగా ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ మీషో పేరుతో స్క్రాచ్ కార్డు, లక్కీ డ్రా అంటూ (Lucky Dip Gifts Frauds)సైబర్ నేరస్థులు లక్షలు కొట్టేస్తున్నారు. లక్కీ డ్రాలో భాగంగా తాము చెప్పినట్లు చేస్తే నగదు, కారు, వివిధ దేశాల్లో టూర్‌లకు ఎంపికవుతారంటూ మోసగిస్తున్నారు. వారిని నమ్మి వాట్సాప్‌లో పంపిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినా డబ్బు పోగొట్టుకున్నట్లేనని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు హెచ్చరిస్తున్నారు. జనవరి నుంచి ఇప్పటివరకూ తెలంగాణలో 15 కేసులు నమోదు కాగా ఎక్కువగా హైదరాబాద్ పరిధిలోనే ఉన్నాయి.
Cyber Cases in Hyderabad : తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఓ వివాహిత ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లో చీర కొనుగోలు చేసింది. 15 రోజుల తర్వాత ఆమెను సంప్రదించిన సైబర్ నేరగాళ్లు (Cyber Crimes) లక్కీ డ్రాలో కారు గెల్చుకున్నట్లు వాట్సాప్‌లో సందేశం పంపారు. నిజమేనని నమ్మిన ఆమె పలు ఛార్జీల కింద రూ.35,000 వారికి పంపించింది. పదేపదే డబ్బులు అడగడంతో మోసం వెలుగులోకి వచ్చింది.