Man Lost Rs.1 Lakh In Cyber Crime in Kamareddy :కుమార్తె ఆపదలో ఉందని నమ్మించిన సైబర్ నేరగాడు ఆమె తండ్రి నుంచి డబ్బులు కాజేసిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే కామారెడ్డి జిల్లా పల్వంచ మండలం భవానిపేట గ్రామానికి చెంది నారెడ్డి వెంకట్ రెడ్డి కుమార్తె అమెరికాలో చదువుతోంది. ఆయన సెల్‌ఫోన్‌కు శనివారం మధ్యాహ్నం గుర్తుతెలియని వ్యక్తి కాల్ చేశాడు.
అమెరికాలో ఉండే మీ కుమార్తె రాధవి గదిలో ఉంటున్న మరో అమ్మాయి మరణించింది. ఆమెను మీ కుమార్తె హత్య చేసినట్లు ఆనవాళ్లున్నాయని, తనని అరెస్టు చేసే అవకాశముందని సైబర్ నేరగాడు నమ్మబలికాడు. తనపై కేసు కావొద్దంటే వెంటనే రూ.2లక్షలు పంపించండి. ఆ డబ్బులతో పోలీసులను సముదాయించి కేసు తప్పించడానికి అవకాశముంటుంది అని వెంకట్ రెడ్డితో చెప్పాడు.
మీ కుమార్తెతో మాట్లాడతావా అంటూ ఓ అమ్మాయి ఏడుస్తున్న గొంతును వినిపించాడు. ఆమె ప్రస్తుతం మాట్లాడే పరిస్థితిలో లేదు, మీరు వీలైనంత త్వరగా డబ్బులు పంపించండి అంటూ తొందరపెట్టాడు. లేదంటే మీ అమ్మాయిని పోలీసులు అరెస్టు చేస్తారు అని భయపెట్టాడు. అనుమానం వచ్చిన తండ్రి అమెరికాలో ఉన్న తన కుమార్తెకు ఫోన్ చేశాడు. ఆమె ఫోన్ కలవలేదు. దీంతో నిజమేనని అనుకున్న వెంకట్‌రెడ్డి సైబర్ నేరగాడు చెప్పిన విధంగా మూడు విడతల్లో మొత్తం కలిపి రూ.లక్ష పంపించాడు. అంతలోనే కుమార్తె రాధవికి ఫోన్ కలవడంతో వెంకట్‌రెడ్డి మాట్లాడాడు. ఇదే విషయంపై అడగ్గా తనకేమీ కాలేదని, ప్రమాదంలో లేనని తెలిపింది. వెంటనే గ్రహించిన బాధితుడు 1930కి జరిగిన మోసంపై ఫిర్యాదు చేశాడు.