Cyber Police Recovered RS 18 Lakhs in 11 Minutes at Hyderabad : సైబర్ చీటర్స్ వలలో నుంచి ఓ టెకీని సైబర్ క్రైం పోలీసులు కాపాడారు. కేవలం 11 నిమిషాల వ్యవధిలోని రూ.18 లక్షల నగదును సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించడంతో తిరిగి పొందగలిగాడు. లేకపోతే సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయేవాడు. ఈ సంఘటన హైదరాబాద్‌లో జరిగింది. ఇక నుంచి ఇలాంటి కాల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రజానికానికి తెలియజేశారు.
పూర్తి వివరాల్లోకి వెళితే అంబర్ పేట్ ప్రాంతంలో నివాసం ఉండే ఓ ప్రముఖ కంపెనీలో పని చేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగికి ఈనెల 27న ఫెడెక్స్ కంపెనీ నుంచి ఓ కాల్ వచ్చింది. కాల్లో తన ఆధార్ కార్డు ఉపయోగించి ముంబయి నుంచి ఇరాన్‌కు డ్రగ్స్ కొరియర్ అవుతున్నట్లు తెలిపారు. అనంతరం ముంబయి క్రైమ్ అధికారి అంటూ బాధితుడుకు స్కైప్ వీడియో కాల్ చేశారు. అక్రమంగా డ్రగ్స్ సరఫరా అవుతున్నాయని అతనిపై కేసు నమోదు అయిందని నకిలీ ఎఫ్ఐఆర్ను పంపించారు.
అలాగే అతని అకౌంట్లో ఉన్న డబ్బును పంపిస్తే ఆర్బీఐ నిబంధనల ప్రకారం వేరిఫై చేసి తిరిగి పంపిస్తామని సాఫ్ట్వేర్ ఉద్యోగిని నమ్మించారు. అందుకు సంబంధించిన నకిలీ ఆర్బీఐ నోటీసును పంపించారు. వాటిని నమ్మిన బాధితుడు తన అకౌంట్లో డబ్బులు లేవని తనకు కొంత సమయం కావాలని అడిగాడు. సైబర్ చీటర్స్ సమయం ఇవ్వమని, నీ అకౌంట్ నుంచి పర్సనల్ లోన్ తీసుకొని తమకు డబ్బులు పంపించాలని ఒత్తిడి చేశారు. వారి మాటలు నమ్మి బ్యాంకు నుంచి రూ.18 లక్షలు అప్పు తీసుకున్నాడు. సైబర్ నేరగాళ్ల అకౌంట్‌కు ట్రాన్ఫర్ చేశాడు. ఆ డబ్బును సైబర్ నేరగాళ్ల ఖాతాకు పంపిన తర్వాత వారు కాల్‌ను కట్ చేశారు.