Cyber Crimes Rising Through WhatsApp Links :షేర్‌ట్రేడింగ్ చేసేవారికి భారీగా లాభాలు ఇప్పిస్తామంటూ దోచుకున్నారు. తమ వాట్సాప్ గ్రూప్‌లో చేరిన వారికి షేర్ మార్కెట్‌లో ప్రముఖ సంస్థలు త్వరలోనే ఐపీవోకు వెళ్తున్నాయని, వాటికోసం దరఖాస్తు చేసుకుంచే షేర్లు దక్కేలా చేస్తామంటూ ఊరించారు. గ్రూప్‌లోని మిగిలిన వారంతా ముఠా సభ్యులే ఉంటారు. అయితే కొత్తగా చేరిన వారిని నమ్మించడానికి వారు తమకు లాభాలపంట పండిందని పోస్టింగులతో హోరెత్తిస్తుంటారు. అవి నమ్మిన కొత్తవారు నిజమేనని వారితో అసలు కంపెనీల యాప్‌ల రూపంలోని నకిలీ యాప్‌లను ఇన్‌స్టాల్ చేయిస్తారు. ఐపీవోకు వెళ్తున్న సంస్థల పేరిట బ్యాంకు ఖాతాల వివరాలు పంపించి వాటిల్లోకి నేరుగా డబ్బు జమ చేస్తే షేర్ల వివరాల పంపిస్తారు.
లాభాలు తీసుకుందామంటే రావు :చాలామంది మొదట్లో కొంత మొత్తం పెట్టుబడితో షేర్లు కొంటారు. పెట్టుబడి, కేటాయించిన షేర్లు, లాభాలు వంటి వివరాలన్నీ వారు సూచించిన యాప్‌లోనే కనిపిస్తాయి. దీనికితోడు ప్రాథమిక స్థాయిలో లాభాలను ఉపసంహరించుకునే ఆప్షన్ ఉంటుంది. కొంత మొత్తానికే భారీ లాభాలు కనిపించడంతో క్రమంగా రూ.కోట్లు పెట్టుబడిగా పెడతారు. కొన్నిరోజులకు లాభాలను ఉపసంహరించుకునేందుకు ప్రయత్నిస్తే చాలు పన్నులు చెల్లించాలంటూ మెలిక పెడతారు. అప్పుడు మొదలవుతుంది అసలు కథ. అప్పటివరకు పని చేసిన కస్టమర్‌కేర్ నంబర్ అవుటాఫ్ కవరేజ్ ఏరియా, వాట్సాప్ ఉంటుంది కానీ అందులో సభ్యులెవ్వరూ స్పందించరు. దీంతో మోసపోయామని గ్రహించిన వారు చివరకు 1930కు ఫిర్యాదులు చేస్తున్నారు.
అంతా మాయలోకం : ఈ మోసాల వెనక చైనా నేరస్థుల ముఠాలున్నాయని ఇండియన్ సైబర్‌క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ దర్యాప్తులో తేలింది. థాయ్‌లాండ్, కంబోడియా, మయన్మార్ తదితర సౌత్‌ఈస్ట్ ఆసియా దేశాల్లో అడ్డారు ఏర్పాటు చేసుకుని ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు వెల్లడైంది. భారతీయ యువకులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని అక్కడికి రప్పించి వారిని నిర్భందించి ఈ తరహా నేరాలు చేయిస్తున్నారని పేర్కొంది.