తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆశతో పెట్టుబడి - మోసాలకు పట్టుబడి - రూ.2.43 కోట్లు పోగొట్టుకున్న ఉద్యోగి, శాస్త్రవేత్త - CYBER CRIME CASES IN HYDERABAD

చిన్నిపెట్టుబడులకు అధిక లాభాలు వస్తాయంటూ సైబర్‌ నేరగాళ్ల వల - ఇద్దరికి కుచ్చుటోపీ

Cyber Crime Cases In Hyderabad
Cyber Crime Cases In Hyderabad (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 14, 2025, 9:28 AM IST

Cyber Crime Cases In Hyderabad :పెట్టుబడులకు భారీగా లాభాలు, స్టాక్‌ ట్రేడింగ్‌ పేరుతో వలేసిన సైబర్‌ నేరగాళ్లు వేరు వేరు ఘటనల్లో ఇద్దరి నుంచి రూ.2.43 కోట్లు కొట్టేశారు. ఓ వ్యక్తి వ్యక్తిగత రుణం తీసుకుని మరీ నగదు పంపడం గమనార్హం. ఓ జాతీయ పరిశోధన సంస్థలో పని చేస్తున్న శాస్త్రవేత్త ఫోన్‌ నెంబరును గుర్తు తెలియని వ్యక్తులు గత సంవత్సరం డిసెంబరు చివరి వారంలో ఓ వాట్సాప్‌ గ్రూపులో చేర్చారు. స్టాక్‌ ట్రేడింగ్‌ చేస్తే బాగా డబ్బు సంపాదించవచ్చని, తాము సలహాలు కూడా ఇస్తామని వాట్సాప్‌ గ్రూపులో సందేశాలు పెట్టేవారు. ఇదంతా వాస్తవమని నమ్మిన శాస్త్రవేత్త వారు చెప్పినట్లు 'యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ లిమిటెడ్‌' పేరుతో ఉన్న యాప్‌ను డౌన్‌లోడ్‌ చేశాడు. షేర్లు కొనుగోలు చేసి నాలుగైదు రోజుల తరువాత మంచి ధర రాగానే అమ్మాలని సూచనలు చేశారు. షేర్లు కొనుగోలు చేయించి డబ్బు వేరు వేరు బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయించేవారు.

మొదటి సారి షేర్లు కొన్నందుకు ఆ శాస్త్రవేత్తకు రూ.50 వేల లాభం వచ్చింది. ఇదంతా వాస్తవమని నమ్మాడు. ఇంకా భారీగా లాభాలు వస్తాయని భావించిన ఆయన గత సంవత్సరం డిసెంబరు 24 నుంచి 18 రోజుల వ్యవధిలో పదహారు లావాదేవీల్లో రూ.1.22 కోట్లు నేరగాళ్లకు పంపించాడు. నగదు సర్దుబాటు కాకపోతే వ్యక్తిగత రుణం తీసుకుని మరీ వారికి పంపించాడు. ఈ పెట్టుబడి లాభంతో కలిపి మొత్తం రూ.3.26 కోట్లకు చేరినట్లు నకిలీ యాప్‌లో వర్చువల్‌గా కనిపించింది. కానీ డబ్బులు తీసుకోవడానికి మాత్రం అవకాశం ఇవ్వడం లేదు. వాట్సాప్‌ ద్వారా సంప్రదించగా ఇప్పుడే విత్‌ డ్రా వద్దని, లాభం మరింత రావాలంటే ఇంకా పెట్టుబడి పెట్టాలంటూ నేరగాళ్లు చెప్పారు. నగదు విత్‌ డ్రాకు అవకాశం ఇవ్వాలని ఒత్తిడి చేశాడు. అదనంగా రూ.కోటి పంపాలంటూ నేరగాళ్లు డిమాండ్‌ చేశారు. దీంతో శాస్త్రవేత్త సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు కంప్లైంట్ చేశాడు.

రూ.10 వేలు ఆశ చూపి దోపిడీ :ఇంటి దగ్గర ఉండి పని చేస్తూ మనీ సంపాదించవచ్చని ఆశ పెట్టి, ఓ ప్రైవేటు ఉద్యోగి నుంచి రూ.1.20 కోట్లు కొట్టేశారు సైబర్‌ నేరగాళ్లు. కేపీహెచ్‌బీలో నివాసం ఉండే ప్రైవేటు ఉద్యోగి (31) వాట్సాప్‌కు ఓ మెసేజ్ వచ్చింది. తాము ఇచ్చే టాస్కులు పూర్తి చేస్తే రోజువారీగా డబ్బులు బ్యాంక్ ఖాతాలో జమ చేస్తామని మెసేజ్​లో ఉంది. ఆశపడ్డ ఉద్యోగి కొన్ని టాస్కులు పూర్తి చేశాడు. దీన్నే అవకాశంగా తీసుకున్న సైబర్ నేరగాళ్లు తాము చెప్పినట్లు పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయని ఆశపెట్టారు. నమ్మిన ప్రైవేటు ఉద్యోగి మొదటి సారి రూ.10,500 పెట్టుబడి పెట్టాడు.

సైబర్ నేరగాళ్లు ఈ మొత్తానికి లాభంతో కలిసి రూ.15,200 తిరిగి పంపారు. రెండోసారి రూ.10,500 పెట్టుబడి పెట్టాడు. అంతకు రెట్టింపు పెట్టాలని నేరగాళ్లు సూచినలు చేశారు. బాధితుడు రూ.50 వేలు పంపగా తిరిగి రూ.65,100 వచ్చినట్లు ఓ వెబ్‌సైట్‌లో వర్చువల్‌గా కనిపించింది. లాభం రావడంతో నమ్మకం పెంచుకున్న ప్రైవేటు ఉద్యోగి మరో రూ.2 లక్షలు పంపాడు. డిసెంబరు 6 నుంచి జనవరి 7 వరకూ పలు దఫాలుగా రూ.1.20 కోట్లు వారికి పంపాడు. దీనికి రూ.14.83 లక్షలు లాభం వచ్చినట్లు వర్చువల్‌గా చూపిస్తున్నా విత్‌ డ్రా చేసుకునే అవకాశం ఇవ్వలేదు. విత్‌ డ్రా చేసుకోవాలంటే ఎక్కువ డబ్బు పంపాలంటూ సైబర్ నేరగాళ్లు బెదిరించారు. చివరికి మోసమని గుర్తించిన బాధితుడు సైబరాబాద్‌ పోలీసులను ఆశ్రయించాడు.

సంక్రాంతికి బంపర్ ఆఫర్‌ అంటూ సోషల్ మీడియాలో లింక్స్ - నమ్మి క్లిక్‌ చేశారో!

'ఉద్యోగం సంగతి తర్వాత - ముందు ట్రేడింగ్ చెయ్' - మాయగాళ్ల ఉచ్చులో ఆ 2 గ్రామాలు

ABOUT THE AUTHOR

...view details