CWPRS Expert Team Visits Medigadda Barrage Today : కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ నిపుణుల బృందం బుధవారం పరిశీలించింది. సీడబ్ల్యూపీఆర్ఎస్ పూణేకు చెందిన జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ నిపుణులు సైంటిస్ట్ జె.ఎస్ ఎడ్లబడ్కర్, జియోఫిజికల్ ఇన్వెస్టిగేషన్ నిపుణులు సైంటిస్ట్ డాక్టర్ ధనుంజయ్ నాయుడు, నాన్ డిస్ట్రిక్టీవ్ పరీక్ష ఎక్స్‌పెర్ట్ డాక్టర్ ప్రకాశ్ పాలేకు బృందం అణువుణువునా పరిశీలిన చేసింది.
మేడిగడ్డపై కాలినడకన తిరుగుతూ అనువణువు పరిశీలించిన నిపుణుల బృందం : ఈ బృందం పూణే నుంచి నేరుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం మేడిగడ్డ బ్యారేజీకి చేరుకున్నారు. ఎల్అండ్ అతిధి గృహంలో భోజనం చేసి సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో చర్చించారు. మేడిగడ్డ బ్యారేజీ వద్దకు చేరుకొని కుంగి, దెబ్బతిన్న ప్రదేశంలో చూశారు. ఏడో బ్లాక్ ప్రాంతంలో బ్యారేజీ వంతెన పై కాలినడకన సాగుతూ పరిశీలించారు. బ్యారేజీ ఎగువ, దిగువ ప్రాంతల్లో తిరుగుతూ అణువుణువునా పరీక్షించారు.
బ్యారేజీ దిగువకు చేరుకొని ఏడో బ్లాక్ ప్రాంతంలో 20పియర్ పగుళ్లు, దెబ్బతిన్న గేటును చూసి, మిగతా గేట్లు, పియర్ల పరిస్థితులను పరిశీలన చేశారు. పియర్లలో పగుళ్లులలో ఎంత మేర కొలతలలో తేడా ఉందో అడిగి తెలుసుకున్నారు. బ్లాక్ 7లో ఎనిమిది గేట్లు, పియర్, డబుల్ పియర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. మేడిగడ్డ బ్యారేజీ దిగువన సీసీ బ్లాక్‌లు ఏ విధంగా కొట్టుకపోయాయో అడిగారు. మేడిగడ్డ బ్యారేజీలో ఇప్పటివరకు ఎలాంటి పరీక్షలు చేశారో అడగగా ఈఆర్టీ, జీపీఆర్టీ పరీక్షలు చేసినట్లు ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు.