Custom Officials Seize Snakes At Shamshabad Airport: విమానాల్లో ప్రయాణికులు ప్రయాణించడం కామన్. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు కొన్ని సార్లు అక్కడ తక్కువ ధరకు లభించే వస్తువులు కొనుగోలు చేసి తెచ్చుకంటారు. ఇలా తెచ్చిన వస్తువులకు పన్నులు చెల్లించారా? లేదా? అని ప్రతి విమానాశ్రయంలోనూ కస్టమ్స్ అధికారులు తనిఖీ చేస్తారు. సాధారణంగా కొన్ని విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో డ్రగ్స్, బంగారం పట్టుబడతాయి. వాటిని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకుంటారు. కానీ శంషాబాద్ విమానాశ్రయంలో ఒక వింత అనుభవం ఎదురైంది. కస్టమ్స్ తనిఖీల్లో ఇద్దరు మహిళ ప్రయాణికుల బ్యాగుల్లో పాములు లభ్యమయ్యాయి. ఎయిర్‌పోర్టులో పాములు పట్టుబడటంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు.
విమానంలో పాములు: బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ వచ్చిన విమాన ప్రయాణికుల బ్యాగులను ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఈ క్రమంలో ఇద్దరు మహిళల వద్ద విష సర్పాలను గుర్తించారు. వెంటనే ఆ ఇద్దరు ప్రయాణికులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ విషపూరితమైన పాములను బ్యాంకాక్ నుంచి ఇక్కడికి ఎందుకు తెచ్చారు. పాముల సరఫరా వెనుక ఏదైనా కుట్ర, అసాంఘీక చర్య ఉందా? అన్న కోణంలో విచారణ చేపట్టారు. పట్టుకున్న పాములను అనకొండలుగా భావిస్తున్నారు. పాములను కస్టమ్స్ అధికారులు పట్టుకున్న విషయం తెలిసి బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ ప్రయాణించిన ప్రయాణికులు భయంతో వణికిపోయారు. ప్రయాణ సమయంలో బ్యాగుల్లోని పాములు బయటికొస్తే తమ పరిస్తితి ఏంటిని ఆందోళన చెందారు.