CS Meeting with Water Resources Department Officials:రాష్ట్రంలో వచ్చే జూన్ నెలాఖరు వరకూ ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో తాగునీటి పరిస్థితులపై పంచాయితీరాజ్ గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా, మున్సిపల్ నీటి సరఫరా విభాగాల అధికారులతో సమీక్షించారు.
తాగునీటి పథకాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి: వచ్చే జూన్ నెలాఖరు వరకూ ఎక్కడా మంచినీటికి ఇబ్బంది రాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎస్ కెఎస్ జవహర్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. నిర్మాణం పూర్తి కావచ్చిన మంచినీటి పధకాలన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. తద్వారా ప్రజలకు మంచినీరు త్వరితగతిన అందుబాటులోకి తేవాలని అధికారులకు స్పష్టం చేశారు. వివిధ సమ్మర్ స్టోరేజి ట్యాంకులు అన్నిటినీ పూర్తిగా నీటితో నింపాలని సీఎస్ ఆదేశించారు. వివిధ తాగునీటి పథకాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని జల వనరులు, ఆర్డబ్ల్యూఎస్, మున్సిపల్ నీటి సరఫరా విభాగాల అధికారులను సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు.
1904 కాల్ సెంటర్కు ఫిర్యాదు: వేసవి నీటి ఎద్దడిని అధిగమించేందుకు రూ.115 కోట్ల అంచనాతో వేసవి కార్యాచరణ ప్రణాళికను సిద్దం చేసినట్టు సీఎస్ తెలిపారు. మంచినీటి ఎద్దడి ఉండే ఆవాసాలు, శివారు కాలనీలకు ట్యాంకర్ల ద్వారా ప్రతి రోజు మంచినీటి సరఫరా చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. మంచినీటి కుళాయిల ద్వారా రోజుకు ఒకసారైనా మంచినీటి సరఫరా జరిగేలా చూడాలని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడైనా మంచినీటికి ఇబ్బంది కలిగితే 1904 కాల్ సెంటర్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించి తక్షణం పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎస్ జవహర్ రెడ్డి స్పష్టం చేశారు.
ఎండిపోతున్న సరస్సుల్లోకి నీరు విడుదల- బెంగళూరు నీటి కొరత తీర్చేందుకు అధికారుల పాట్లు