Simhachalam Railway Station Development : సింహాచలం దేవస్థానానికి ఆధ్యాత్మికంగా ఎంత గుర్తింపు ఉందో రవాణా పరంగా సింహాచలం రైల్వేస్టేషన్‌కు సైతం అంతే గుర్తింపు ఉంది. దేశంలోని పలు ప్రాంతాలకు ఈ స్టేషన్ అనుసంధానమై ఉంది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ స్టేషన్‌పై మొన్నటి వరకు చిన్నచూపు ఉన్నప్పటికీ అమృత్ భారత్ పథకం కింద ఇటీవల నిధులు మంజూరు కావడంతో అభివృద్ధి పనులకు అడుగులు పడ్డాయి. అమృత్ భారత్ కింద రూ.19.98 కోట్లు, చంద్రనగర్ నడకవంతెనకు రూ.12.69 కోట్ల నిధులు విడుదలయ్యాయి.
శరవేగంగా పనులు: ప్రస్తుతం ఈ స్టేషన్‌లో ఒకటి, రెండు ఫ్లాట్‌ఫారాలున్నాయి. ప్రయాణికుల సౌకర్యార్థం అదనంగా మరో మూడు ఫ్లాట్‌ఫారాల నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న రెండు పాత ఫ్లాట్‌ఫామ్‌లను 200 మీటర్ల మేర గ్రానైట్‌తో తిరిగి ఆధునికీకరిస్తున్నారు. ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని 12 మీటర్ల వెడల్పున ఎండ్ టూ ఎండ్ ఫుట్‌పాత్ ఓవర్‌బ్రిడ్జ్‌ను నిర్మిస్తున్నారు. దీనికి రెండు రెండు లిఫ్ట్‌లు, ఒక ఎస్క్‌లేటర్ అనుసంధానించనున్నారు. ప్రయాణికులు విశ్రాంతి తీసుకోవడానికి విశాలమైన రెండు వెయిటింగ్ హాళ్లు, విశాలమైన ఏసీ వెయిటింగ్ హాలు నిర్మిస్తున్నారు.
వాటి వివరాలు: సాధారణ, రిజర్వేషన్ టిక్కెట్ కౌంటర్ల పనులు కొనసాగుతున్నాయి. ఆధునికంగా 8 మరుగుదొడ్లు నిర్మాణం జరుగుతోంది. రెండు ఫ్లాట్‌ఫారాలపై 600 మీటర్ల పొడవునా నాలుగు అధునాతన షెడ్లు నిర్మించారు. విద్యుత్తు సదుపాయం కల్పిస్తున్నారు. ఎలక్ట్రానిక్ డిస్‌ప్లే బోర్డులు వ్యర్థాల నిర్వహణ యూనిట్లు, 1000 మీటర్ల గార్డెనింగ్, 13 సీసీ కెమెరాలు ఏర్పాటవుతున్నాయి.
చంద్రనగర్ నడకవంతెన నిర్మాణానికి 12.69 కోట్లు: సింహాచలం రైల్వేస్టేషన్-చంద్రనగర్ మధ్య నడక వంతెన నిర్మాణానికి తూర్పు కోస్తా రైల్వే రూ.12.69 కోట్ల నిధులు మంజూరు చేసింది. ప్రస్తుతం ఉన్న నడక వంతెనను కూల్చివేసి అదే స్థానంలో 3 మీటర్ల వెడల్పు, 115 మీటర్ల పొడవుతో నడక వంతెన నిర్మాణ పనులు జరుగుతాయి.
సింహాచలం శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయాన్ని పోలిన విధంగా రైల్వేస్టేషన్ ప్రధాన మార్గంలో బయటకు వచ్చే ముఖ ద్వారాలు నిర్మిస్తున్నారు. రోజూ ప్రయాణికుల సంఖ్య సుమారు 5వేల మంది వరకు ఉంటుంది. అంతే కాకుండా దాదాపు ఇక్కడ రోజూ 16 రైళ్లను నిలుపుతారు. స్టేషన్‌కు ఏటా ఆదాయం రూ.11 కోట్లు వరకూ వస్తోంది. అమృత్ భారత్ కింద రైల్వే అభివృద్ధికి రూ.19.98 కోట్లు కాగా, చంద్రనగర్ నడకవంతెనకు గాను మరో రూ. 12.69 కోట్ల నిధులు విడుదలయ్యాయి.
పట్టాలెక్కని విశాఖ రైల్వే ఆధునికీకరణ ప్రాజెక్టు- ఏడాదిన్నరగా నిలిచిన పనులు - VISAKHA RAILWAY STATION