Dog Show in Rajahmundry : రోడ్డుపై భౌ భౌ అంటూ అరిచి భయపెట్టే శునకాలు అందంగా ముస్తాబు అయి ఆకట్టుకుంటున్నాయి. చక్కగా చొక్కా , గౌనుతో సోకు చేసుకుని ర్యాంప్ వాక్ చేశాయి. గోదావరి కెన్నెల్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన డాగ్ షోలో రాష్ట్ర నలుమూలల నుంచి అన్ని రకాల బ్రీడ్ శునకాలు పాల్గొన్నాయి. షోలో పాల్గొన్న వారిని ఎంతో ఆకర్షించాయి.
రాజమహేంద్రవరం జేఎన్. రోడ్‌లో ఏర్పాటు చేసిన డాగ్ షో ఆకట్టుకుంది. గోదావరి కెన్నెల్ క్లబ్ (Godavari Kennel Club) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. డాగ్ షోలో వివిధ జాతుల శునకాలు పాల్గొని సందడి చేశాయి. జంతు ప్రేమికులు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తమ పెంపుడు శునకాలతో డాగ్ షోకు వచ్చారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రింగ్‌లో శునకాలతో ప్రదర్శన ఇచ్చారు.
సుమారు 300 వరకు మేలుజాతి శునకాలు షోలో పాల్గొన్నాయి. శునకాలకు ఏర్పాటు చేసిన ఫ్యాషన్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ డాగ్ షోకు ప్రత్యేక అతిథిగా విచ్చేశారు. మెరుగైన ప్రదర్శన చేసిన శునకాలకు బహుమతులు అందజేశారు.
డాగ్ షో - కనువిందు చేసిన పెంపుడు శునకాలు
'తరచూ అలా డాగ్షోలు నిర్వహించడం చాలా ఆనందగా ఉంది. మా డాగ్ పేరు హోబో, సీజ్ బ్రీడ్. ఇక్కడ పోటీల్లో రాట్ వీలర్, పమేరియన్, జర్మన్ షెప్పర్డ్, లాబ్ రేడర్, చువావా, చౌచౌ, గ్రేట్ డేన్, హక్కీ, గోల్డెన్ రిట్రీవర్, బీగెల్ వంటి ప్రముఖ బ్రీడ్‌లకు చెందిన శునకాలు పాల్గొన్నాయి. ఇది పెట్ లవర్స్‌కు మంచి అవకాశం. వారి పెట్స్ పైన వారికున్న ప్రేమ చాటుకోవచ్చు మంచి బహుమతులు గెలుచుకోవచ్చు.' - షోలో పాల్గొన్న పెట్ లవర్స్
ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించటం ఎంతో ఆనందంగా ఉందని కార్యక్రమంలో పాల్గొన్నవారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాల నిర్వహణ వల్ల ప్రజలలో పెంపుడు జంతువులపై అవగాహన పెరుగుతుందని అభిప్రకాయపడ్డారు. ఇలా పోటీలకు తీసుకురావడంతో తమ పెట్స్ కూడా ఆక్టివ్‌గా ఉంటున్నాయని కొందరు యజమానులు తెలిపారు.
పమేరియన్ పరుగులు, షెపర్డ్ సోకులు -ఈ డాగ్స్‌ని చూస్తే వామ్మో కాదు వావ్ అనాల్సిందే