Kotia Battle of Border Between AP and Odisha States : ఏవోబీ వివాదాస్పద ప్రాంతం కొటియాలో పట్టు సాధించడం కోసం ఒడిశా మళ్లీ దూకుడు పెంచింది. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండల పరిధిలోని 21 గ్రామాలపై ఆధిపత్యం కోసం నిత్యం కొటియాలో గొడవలకు దిగుతోంది. కూటమి సర్కార్ చేపట్టిన అభివృద్ధి పనుల్ని సైతం అడ్డుకుంటోంది. దీనిపై ఏపీ ప్రభుత్వ పెద్దలు స్పందించి ఇలాంటి చర్యలకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు.
ఆంధ్ర-ఒడిశా సరిహద్దు మధ్య ఎన్నో ఏళ్లుగా కొటియా గ్రామాల సమస్య నలుగుతోంది. ఈ వివాదం బ్రిటీష్ కాలంలోని మద్రాస్, కలకత్తా ప్రెసిడెన్సీల నుంచి కొనసాగుతోంది. భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడిన అనంతరం కొటియా గ్రామాలు తమవేనంటూ ఒడిశా 1968లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై న్యాయస్థానం అప్పట్లో స్టేటస్ కో జారీ చేసింది. కొటియా గ్రూప్ గ్రామాలపై పట్టుకోసం 2018 నుంచి ఒడిశా దూకుడు పెంచింది.
2021లో జరిగిన పరిషత్ ఎన్నికల సమయంలో ఒడిశా ప్రభుత్వం మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. వివాదాన్ని రెండు రాష్ట్రాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని కోర్టు అప్పట్లో సూచించింది. తదనంతరం నాటి ఇరు రాష్ట్రాల సీఎంలు నవీన్ పట్నాక్, జగన్ సమావేశమై చర్చించినా వివాదం పరిష్కారం కాలేదు. అది జరిగి నేటికి మూడేళ్లు పూర్తయినా ఆ దిశగా అడుగులు పడలేదు. ఏపీ నుంచి వెళ్లే అధికారులను ఎప్పటికప్పుడు ఒడిశా అధికారులు ఆటంకాలు కల్పిస్తున్నారు. గతంలో కలెక్టర్ నిశాంత్ కుమార్ కొటియా గ్రామానికి వెళ్లేందుకు యత్నించి ధూళిభద్ర నుంచి వెనుదిరిగాల్సి వచ్చింది.
కొఠియాలో మరోసారి ఒడిశా-ఆంధ్ర అధికారులు మధ్య వాగ్వాదం
'దిగువశెంబి అంగన్వాడీ కేంద్రంలో తెలుగులో ఉన్న టీఎల్ఎం పోస్టర్లు, కేంద్రం పేరు బోర్డును ఒడిశా అధికారులు తీసుకెళ్లారు. తాజాగా ఎగువశెంబి, దిగువశెంబి గ్రామాల్లో జలజీవన్ మిషన్ పనులను అడ్డకుని సామగ్రి తీసుకెళ్లారు.' -స్థానికులు
Polling in Kotia villages: 'ఒడిశా వద్దు.. ఆంధ్ర ముద్దు' అంటున్న కొఠియా గ్రామ గిరిజనులు
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కొటియాలో ఒడిశా దూకుడుకి కారణమని మంత్రి సంధ్యారాణి ఆరోపించారు. ఇటీవల పరిణామాల దృష్ట్యా సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు.కేంద్రంలో, ఒడిశాలో, ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉండటం కొటియా వివాదాన్ని పరిష్కరించడానికి మంచి అవకాశమని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని సమస్య పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.