APPSC Group-2 Exam Preparation Tips : ఏపీపీఎస్సీ గ్రూప్-2 పరీక్షా సమయం ఆసన్నమైంది. పరీక్షకు ఇంకా ఐదు రోజుల వ్యవధి మాత్రమే ఉంది. ఈ కొద్ది సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం చాలా ముఖ్యం. పరీక్ష రోజున ఎటువంటి మానసిక సంసిద్ధత ఉండాలి ఈ నాలుగైదు రోజుల్లో ఎలా చదుకోవాలో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఈ నిర్ణయం వద్దు : ఈ సమయంలో రెండు పేపర్ల రివిజన్ చేయాలనుకోవడం సరైన నిర్ణయం కాదు. ఇప్పటికే గట్టి పట్టు ఉన్న భాగాలను మళ్లీ చదువుకోవడంతో సరిపెట్టుకోవచ్చు. కష్టంగా ఉండే ఎకానమీలాంటి విభాగాలకు కాస్త ఎక్కువ సమయం కేటాయించి పునశ్చరణ చేసుకుంటే సమయాన్ని సముచితంగా సద్వినియోగం చేసుకోవచ్చు.
కాన్సెప్టులపై పట్టుంటే ఫ్యాక్ట్స్ ఆధారిత సన్నద్ధత సరిపోతుంది ఇవి చాలా ముఖ్యం
- ఆంధ్రప్రదేశ్ చరిత్రలోని సంవత్సరాలు, రచనలు, కీలకమైన సంఘటనలు
- పాలిటీలోని రాజ్యాంగ ఆర్టికల్స్, కోర్టు కేసులు, ముఖ్య సంఘటనలు, వివిధ సంవత్సరాల్లో వివిధ పదవులు నిర్వహించిన ప్రముఖులు
- ఎకనామిక్ సర్వే ఆధారిత భారతదేశ, ఆంధ్రప్రదేశ్ గణాంకాలు, వివిధ నివేదికల కీలక అంశాలు, కొత్త విధానాల్లోని ముఖ్యాంశాలు
- సైన్స్ అండ్ టెక్నాలజీలోని అవస్థాపన సౌకర్యాలు, తాజా పరిణామాలు, కొత్త ఆవిష్కరణలు
- ఇంధన నిర్వహణ విభాగంలోని కాన్సెప్టులు, ఎకనామిక్ సర్వే ఆధారిత ఇంధన వనరుల సామర్థ్యాలు, జనవరి నెల చివరికి వివిధ ఇంధన వనరుల స్థాపిత సామర్థ్యాలు ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీకి తోడ్పడే సంప్రదాయ వనరుల పురోగతి
- పర్యావరణ సంబంధిత అంతర్జాతీయ ఒప్పందాలు, వాటిలో భారతదేశ భాగస్వామ్యం, పర్యావరణ భావనలు, తాజా- గత సంవత్సరపు ఆర్థిక సర్వే, బడ్జెట్‌ల ఆధారంగా దేశంలో పర్యావరణ పరిరక్షణ చర్యలు, సంబంధిత గణాంకాలు
ఇలాంటివన్నీ ఫ్యాక్ట్స్ ఆధారిత సన్నద్ధతకు ఉపయోగపడతాయి. కాబట్టి ఈ కొద్ది సమయాన్ని ఆ అంశాల రివిజన్‌కు వినియోగించండి.
భారత రాజ్యాంగం, భారత, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలు, శాస్త్ర సాంకేతిక విషయాలు, పర్యావరణ విషయాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. అందువల్ల స్థిరమైన సమాచారంపై మాత్రమే ఆధారపడకుండా వర్తమాన విషయాలను జోడించుకున్నప్పుడే సన్నద్ధతలో సంపూర్ణత్వం ఏర్పడుతుంది. ప్రణాళిక ప్రకారం సన్నద్ధమవుతున్న సీనియర్ అభ్యర్థులు తాజా అంశాలను మిళితం చేసుకుంటూ చదువుతారు కాబట్టి వారికెలాంటి సమస్యా ఉండదు.
కానీ కారణం ఏదైనా తాజా అంశాలను సన్నద్ధతలో జోడించుకోలేనివారుంటారు. వీరు సిలబస్ ఆధారంగా గత తొమ్మిది నెలల తాజా అంశాలను చదవటానికి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. అయితే ప్రాథమిక అంశాలపై పట్టున్నప్పుడు మాత్రమే ఈ సమయాన్ని తాజా అంశాలకు కేటాయించాలి. ప్రాథమిక అంశాలపై పట్టు లేనట్లయితే తాజా అంశాలు చదివి పెద్ద ప్రయోజనాన్ని పొందలేరు.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే, బడ్జెట్‌లపై కూడా ఇబ్బందిని అభ్యర్థులు ఎదుర్కొంటున్నారు. దినపత్రికల్లో వచ్చిన సమాచారం ఆధారంగా సర్వే- బడ్జెట్ సంబంధిత అంశాలపై స్థూల అవగాహన ఏర్పరచుకుంటే ప్రస్తుత సమయాన్ని తెలివిగా వాడుకున్నట్టే!
టెస్టులు వద్దు: ఈ కొద్ది రోజుల సమయంలో టెస్టులూ, గ్రాండ్ టెస్టులూ రాయటం వల్ల ఒత్తిళ్లకు గురి కావొచ్చు. ఆ పరీక్షల్లో వచ్చే మార్పులను ప్రామాణికంగా తీసుకుని ఉప్పొంగటమో, కుంగిపోవటమో జరిగే ప్రమాదం ఉంది. రెండిటి ఫలితం ఇబ్బందే. అందువల్ల కేవలం రివిజన్ కోసం సమయం కేటాయించడం మంచిది.
నో సోషల్ మీడియా : సోషల్ మీడియా ఎంతో ఉపయోగకరమో అంతే సమస్యాత్మకం. కీలకమైన పరీక్ష తరుణంలో ప్రశాంతంగా ఉంటేనే ఎక్కువ ఫలితాలకు అవకాశం ఉంది. సోషల్ మీడియాలో వచ్చే ప్రచారాలు, వదంతులూ ఇబ్బంది పెట్టొచ్చు వాటికి దూరంగా ఉండటం శ్రేయస్కరం.
పరీక్ష దగ్గరకు వస్తున్న కొద్దీ చాలామంది నిద్రాహారాలు మాని చదువుతుంటారు. ఈ ధోరణి సరైంది కాదు. కనీసం రోజులో ఎనిమిది గంటల పూర్తి విశ్రాంతి వల్ల మెదడు అనేక విషయాన్ని గ్రహించడమే కాకుండా పరీక్ష రోజున కూడా ప్రభావంతంగా పనిచేస్తుంది. ప్రశాంతమైన నిద్ర అభ్యర్థి పని తీరును పెంచుతుందని గుర్తించాలి.
సిలబస్ పూర్తి కాలేదా?: చాలామంది సిలబస్ మొత్తాన్ని పూర్తి చేయలేకపోవటానికి అనేక కారణాలు ఉండవచ్చు. పరీక్ష జరగదేమో అనే భావనతో ఎక్కువమంది, చిరు ఉద్యోగాలు చేసుకుంటూ సమయం కేటాయించలేక మరికొంతమంది, మిగతా విషయాలపై పట్టు తెచ్చుకునే క్రమంలో కొన్ని విషయాలను వదిలేసే అభ్యర్థులు మరి కొంతమంది ఇలా విభిన్న రకాల ఉద్యోగార్థులు సిలబస్ పూర్తి చేయలేకపోవటం సర్వసాధారణం. హాల్ టికెట్లు కూడా డౌన్లోడ్ అవుతున్న నేపథ్యంలో పరీక్ష ప్రకటించిన తేదీకే జరుగుతుందని తెలిసి ‘ఇప్పుడేం చేయాలా!’ అని మధనపడుతున్నారు. ఇలాంటి అభ్యర్థులందరూ ఇప్పటివరకు చదవని విషయాలపై దృష్టి పెట్టే కంటే చదివినవాటిపైనే దృష్టి పెట్టి రివిజన్ చేయడం మేలు. అంటే ఈ కొద్ది రోజుల్లో ప్రిపేర్ కాని సిలబస్‌ను వదిలివేయటమే మెరుగైన ఫలితాలకు దారి తీస్తుంది.
పరీక్ష రోజున ఇవి తప్పనిసరి అంటున్న నిపుణులు
- పరీక్ష హాలుకు వెళుతూ కూడా చాలా మంది పుస్తకాలు చదువుతూనే ఉంటారు. ఈ తరహా ప్రిపరేషన్ గతం నుంచి ఏర్పడిన జ్ఞాపకశక్తిపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అందుకే పరీక్ష ముందు రోజు రాత్రి 8 గంటల సమయం నుంచి సన్నద్ధత ఆపి వేయాలి. ప్రశాంతంగా ఉండాలి. ఇతర పట్టణాల్లో పరీక్ష అయితే ముందు రోజే అక్కడకు చేరుకుంటే ఒత్తిడి తగ్గుతుంది.
- ఇటీవల మారిన ప్రశ్నల ధోరణిని బట్టి ఆబ్జెక్టివ్ ప్రశ్నల పరీక్షల్లో సమయ నిర్వహణ కీలకమైంది. సుదీర్ఘ ప్రశ్నలు, స్టేట్‌మెంట్ ప్రశ్నలు, ఎసర్షన్ రీజనింగ్ ప్రశ్నలు, జతపరిచే రూపంలో వస్తున్న ప్రశ్నలు అభ్యర్థుల సమయాన్ని వేగంగా హరించివేస్తున్నాయి. సరైన సమయ నిర్వహణ పాటించకపోతే సమస్యే. ముఖ్యంగా సుదీర్ఘ ప్రశ్నలను మొదటి రౌండ్లో వదిలివేసి ఒకసారి మిగిలిన ప్రశ్నల్లో సాధించగలిగినవి పూర్తి చేసుకోవాలి. తరవాత తాజా ధోరణి ప్రశ్నలకు రావటం మంచిది. అప్పుడు సమయాన్ని సద్వినియోగం చేసుకోవటమే కాక అభ్యర్థి మీద ఒత్తిడి తగ్గుతుంది.
- గత ఏడాది కాలంలో జరిగిన గ్రూప్ 1, 2 ప్రిలిమ్స్ పరీక్షల్లో, తెలంగాణ ఆబ్జెక్టివ్ పరీక్షల్లో అడిగిన ప్రశ్నల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే ప్రస్తుత ట్రెండ్ అర్థమవుతుంది. అలాంటివి పరీక్ష హాల్లో ఎలా ఎదుర్కోవాలి, ఎలా వదిలివేయాలి అనే మానసిక ప్రణాళికతో పరీక్ష హాల్లోకి ప్రవేశించవచ్చు. పరీక్ష పూర్తయ్యేవరకు అదే ధోరణితో ఉండాలి.
- మీ సిరీస్ ప్రశ్నపత్రంలో మొదట కఠినమైన ప్రశ్నలు రావచ్చు. అలాంటి సందర్భంలో అందరికీ అదే కఠినత్వం ఉంటుందని సానుకూలంగా ఆలోచించండి. సమాధానాలు ఇవ్వగలిగితే ముందుకెళ్లండి. లేకుంటే వదిలి వేయండి. కఠినమైన ప్రశ్నలు చూసి చేతులెత్తేయవద్దు.
- ఒక విభాగంలోనో, ఒక పేపర్‌నో బాగా రాయలేదని పోటీ నుంచి నిష్క్రమించకండి. పోటీ పరీక్షల్లో ఎప్పుడు ఎవరికి పై చేయి వస్తుందో స్పష్టంగా చెప్పలేం. అందువల్ల రెండు పేపర్లు పూర్తి చేసేంతవరకూ ‘బాగానే పరీక్ష రాస్తున్నా’ అనే భావనతో పరీక్ష హాల్లో వ్యవహరించండి.
- హాల్ టికెట్‌తో పాటు ఇచ్చిన నిబంధనలు కచ్చితంగా చదవండి. అనుసరించండి. ఎగ్జామినర్ చెప్పే ప్రతి సూచననూ తప్పకుండా పాటించండి. పరీక్ష రాసే అభ్యర్థులు కనీసం ఒక శాతమైనా ఈ జాగ్రత్త లేక నష్టపోతుంటారు. ఈ విషయం మర్చిపోకూడదు.
- కొడాలి భవానీశంకర్