Crime Cases In Warangal 2024:రాష్ట్రంలో రెండో అతిపెద్ద నగరం వరంగల్. ఇటీవల వరుసగా జరుగుతున్న దొంగతనాలు, హత్యలు, గంజాయి కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా నగరంలో రెండుచోట్ల గొలుసుదొంగలు మహిళల మెడలో నుంచి బంగారు గొలుసులు లాక్కెళ్లిపోవడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
గంట వ్యవధిలో రెండు గొలుసు దొంగతనాలు : నగరంలో వరుస దొంగతనాలతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. మంగళవారం రాత్రి రెండుచోట్ల మహిళల మెడలో నుంచి బంగారు గొలుసులు లాక్కెళ్లారు. గంట వ్యవధిలోనే మట్టెవాడ ఠాణా పరిధిలోని ఒకటి, ఇంతేజార్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మేదరివాడలో మరో చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డారు.
పోలీసుల కథనం ప్రకారం: మేదరివాడలో రాజలక్ష్మి అనే వృద్ధురాలు అయ్యప్ప చౌదాపుడి పూజ దుకాణం నిర్వహిస్తున్నారు. మంగళవారం రాత్రి షాపు మూసివేస్తున్న సమయంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు దొంగలు పూజా సామగ్రి కావాలని అడగటంతో గుమాస్తా లోపలికి వెళ్లాడు. ఈ క్రమంలో దుకాణం కౌంటర్ వద్ద ఉన్న వృద్ధురాలి సమీపంలోకి వచ్చిన ఓ దొంగ మెడలోని రెండు తులాల బంగారు గొలుసు లాక్కెళ్లాడు. బాధితురాలు అరుస్తుండంగానే దుకాణం బయట వేచి ఉన్న మరో దొంగ వాహనం ఎక్కి పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
Murders In Warangal :వరంగల్‌లో ఇటీవల వరుసగా హత్యలు జరగడం ఆందోళన కలిగిస్తున్నాయి. పాత కక్షలు, వివాహేతర సంబంధాలు, ఆర్థిక లావాదేవీల కారణంగా గత ఆరు నెలల్లో 24 హత్యలు, 57 వరకు హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. 2023లో పోలీస్ కమిషనరేట్ పరిధిలో 44 హత్యలు జరిగాయి. ఈ సంవత్సరం జనవరి నుంచి జూన్ వరకు నెలకు నాలుగు చొప్పున హత్యలు జరగడం ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. పాత కక్షలు, ప్రాంతాల మీద ఆధిపత్యం కోసం జరిగే హత్యలను అడ్డుకునే అవకాశం ఉన్నా.. నగర పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారన్నారని విమర్శలు తలెత్తుతున్నాయి.
రౌడీ షీటర్లు చెప్పినట్టే కేసులు : రాజకీయ నాయకుల అండ ఉన్న రౌడీ షీటర్ల జోలికి వెళ్లేందుకు పోలీసులు భయపడుతున్నారు. ఎవరి అండా లేనివారిని మాత్రమే పోలీస్ స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. మరోవైపు కొందరు భూ వివాదాల్లో తలదూరుస్తూ సెటిల్‌మెంట్లు చేస్తున్నారు. ఇదంతా పోలీసులకు తెలిసినా వారు వీటిని పట్టించుకోవడం లేదు. ఓ ఠాణాలో పనిచేస్తున్న పోలీస్ బాస్ పాత రౌడీషీటర్ చెప్పినట్లు చేస్తుండడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎవరిపై ఎప్పుడు, ఏ కేసు పెట్టాలో పాత రౌడీషీటర్లే మార్గనిర్దేశం చేస్తుండడం పరిస్థితి తీవ్రతను చెబుతోంది. ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నా పోలీసు పెద్దలు మాత్రం పట్టించుకోవడం లేదు.
నగరంలో గంజాయి విక్రయాలు : నగరంలో గంజాయి విక్రయాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీనిలో ఎక్కువగా యువత ఉండటం తీవ్ర చర్యనీయాంశంగా మారింది. యువత విచ్చలవిడిగా గంజాయి తాగుతూ ఇతరులకు అమ్ముతున్నారు. ఒడిశా, అరకు, విశాఖపట్నం, తూర్పుగోదారి జిల్లా నుంచి యథేచ్ఛగా గంజాయి తీసుకొని వచ్చి విక్రయిస్తున్నారు. ఈ ఏడాదిలో 35 కేసులు నమోదు కాగా 84 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ ముఠా నుంచి రూ.10 లక్షల విలువైన గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఇంకా గంజాయి ముఠా పోలీసుల కళ్లుగప్పి విక్రయిస్తున్నది ఇంతకు పదింతలు ఉంటుందని అంచనా.