CREDAI South Con 2024 event in Krishna District:సాధ్యమైనంత త్వరగా అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అన్నారు. కృష్ణా జిల్లా కంకిపాడు ఆయనా కన్వెన్షన్ సెంటర్లో క్రెడాయ్ (కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా) సౌత్ కాన్ 2024 ప్రారంభమైంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి బిల్డర్స్ విచ్చేసారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2014 నుంచి 2019 వరకు ఎలాంటి అభివృద్ధి జరిగిందో మీ అందరూ చూశారని మంత్రి అన్నారు.
నిర్మాణ రంగానికి జగన్ హయాంలో కొంత ఇబ్బంది వచ్చిందని అన్నారు. అనుమతుల కోసం బిల్డర్లు ఎవరూ కార్యాలయాల చుట్టూ తిరగకుండా అనుమతులు ఇచ్చేందుకు ప్రత్యేక సాఫ్ట్వేర్ తీసుకొస్తున్నామని వెల్లడించారు. మున్సిపల్ శాఖతో అన్ని శాఖల సాప్ట్వేర్లను అనుసంధానం చేస్తున్నామని మంత్రి తెలిపారు. బిల్డర్లు అన్లైన్లో అనుమతుల కోసం డబ్బులు చెల్లిస్తే అన్ని శాఖల అనుమతులు వచ్చేలా చేస్తామని పేర్కొన్నారు.
జీవో 16ని గతంలో తామే ఇచ్చామని ఇప్పుడు దానిని అమలు చేస్తామని తెలిపారు. సింగిల్ విండో అనుమతులకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని పేర్కొన్నారు. అమరావతి రాజధాని నిర్మాణం కోసం రూ. 60 వేల కోట్లు ఖర్చు అవుతుందని తెలిపారు. ప్రపంచంలోనే ఉత్తమ నగరంగా అమరావతి నిలుస్తుందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం వచ్చి నెలల మాత్రమే అవుతుందని బిల్డర్స్ అర్థం చేసుకోవాలని కోరారు. బిల్డర్స్ లేవనెత్తిన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.