Virat Kohli Statue :విరాట్ కోహ్లీ పేరు వింటేనే క్రికెట్ అభిమానుల్లో ఎనలేని జోష్ వస్తుంది. సెంచరీల మీద సెంచరీలు చేస్తూ సాగిపోయే కోహ్లీని రన్ మెషీన్ అంటూ కొనియాడుతుంటారు. విరాట్ బ్యాట్ పట్టుకొని గ్రౌండ్లోకి దిగితే చాలు రికార్డులు బద్దలవ్వాల్సిందే. వన్డే క్రికెట్లో ఎవరికీ సాధ్యం కాని ఎన్నో రికార్డులను తన పేరుపై లిఖించుకున్నాడు. కేవలం బ్యాటింగ్‌లోనే కాదు, ఇటు ఫీల్డింగ్‌లోనూ అత్యుత్తమ ప్రమాణాలను నెలకొల్పాడు. విరాట్ వైపు బాల్ వెళ్లిందంటే ఎలాంటి బ్యాట్సెమెన్ అయినా రెండో పరుగు కోసం ఆలోచించాల్సిందే. దీంతో ప్రపంచ క్రికెట్లోనే అత్యుత్తమ ఫీల్డర్లో ఒకడిగా 'చీకూ'కు పేరుంది.
అలాగే ఫిట్నెస్ విషయంలోనూ విరాట్ తర్వాతనే ఎవరైనా అనేలా ఉంటుంది అతడి శరీర దారుఢ్యం. తోటి క్రికెటర్లకు ఫిటెనెస్ విషయంలో ఎప్పుడూ స్ఫూర్తిగా ఉంటాడు. 22 గజాల పిచ్ మధ్య అత్యంత వేగంగా పరుగు పెడుతుంటాడు. ఇంకో విషయం.. అతడిని ఆస్ట్రేలియా క్రికెటర్లు విరాట్ ఆస్ట్రేలియన్‌లా ఆడతాడు అని మెచ్చుకుంటుంటారు. నేటి తరం క్రికెట్ ఆడేవాళ్లకు ఎప్పుడూ కోహ్లీనే స్ఫూర్తి. ఇంతకీ విరాట్ కోహ్లీ గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే.. విరాట్ కోహ్లీ విగ్రహాన్ని తెలంగాణలో ఏర్పాటు చేశారు. అవునా అని ఆశ్చర్యపోతున్నారా! అది ఎక్కడుందో తెలుసా?
కోహ్లీ విగ్రహం : ఖమ్మం నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో విరాట్ కోహ్లీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కుర్చీలో కూర్చొని ఉన్న దిగ్గజ క్రికెటర్ విరాట్ కోహ్లీ, ప్యాడ్లు కట్టుకొని బ్యాటింగ్‌కు సిద్ధంగా ఉన్నట్లు ఈ బొమ్మ రూపం ఉంది. యువ క్రికెటర్లలో స్ఫూర్తిని నింపేందుకు అక్కడి నిర్వాహకులు ఇలా కింగ్ కోహ్లీ బొమ్మను ఏర్పాటు చేశారు. 12 కుర్చీలు ఉండగా, మొదటి వరుసలో ఓ సీటులో కోహ్లీ బొమ్మను సిద్ధం చేశారు. ఈ బొమ్మను శాశ్వతంగా అక్కడే ఉంచరు.