Credai 13th Edition Property Show : హైదరాబాద్‌లో స్థిరాస్తి రంగం దినదినాభివృద్ధి చెందుతోందని, ముంబయి తర్వాత అత్యధిక నిర్మాణాలు నగరంలోనే ఉన్నాయని క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా (Credai) ఆధ్వర్యంలో 13వ ఎడిషన్ క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షోను హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో మార్చి 8 నుంచి 10, 2024 వరకు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో గృహ కొనుగోలుదారులు పేరొందిన నిర్మాణ సంస్థలకు చెందిన అపార్ట్‌మెంట్‌లు, విల్లాలు, ఇళ్ల గురించి తెలుసుకోవచ్చని ఆయన వివరించారు.
Credai Property show for Householders : రాష్ట్రాభివృద్ధి విషయంలో ఒక్కో ప్రభుత్వం ఒక్కో విధానంతో ముందుకు వెళ్తుందని, ఆయా ప్రభుత్వాల సహకారంతో క్రెడాయ్ కార్యకలాపాలు నిర్వహిస్తుందని రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే మూసీ సుందరీకరణకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోందని గుర్తు చేశారు. మెట్రో విస్తరణ, రీజినల్ రింగు రోడ్డుతో హైదరాబాద్‌కు అవకాశాలు మరింత ఎక్కువవుతున్నాయని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో నగరంలోని రియల్ ఎస్టేట్ మార్కెట్లో స్థిరమైన పెరుగుదల కనబరుస్తోందని చెప్పారు. ప్రాపర్టీ ధరలు పెరుగుతున్నప్పటికీ, నగరంలో గృహ కొనుగోలుదారులను ఆకర్షిస్తూనే ఉందని అన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే నవంబర్ 2023లో ప్రాపర్టీ ధరల్లో 25% పెరిగిందని తెలిపారు.
'2024లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ భవిష్యత్ ఆశాజనకంగా కనిపిస్తోంది. ప్రస్తుతం నగరంలో వృద్ధి జోరు కొనసాగుతుంది. ప్రస్తుత ప్రభుత్వం రూ. 40,000 కోట్లకు పైగా తాజా పెట్టుబడులను రాష్ట్రానికి ఆకర్షించింది. దీంతో కార్యాలయాలు, నివాస స్థలాలను ఏర్పాటు చేయవలసిన అవసరాన్ని ఇవి పెంచనున్నాయి. మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి, విమానాశ్రయాన్ని కూడా అనుసంధానించడానికి నగర జనాభాలో ఎక్కువ మంది అవసరాలను తీర్చడానికి మెట్రో రైలు 2వ దశను కూడా ప్రభుత్వం ఆమోదించింది' - రాజశేఖర్ రెడ్డి, క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడు