CRDA Employees Demanding Bribe: రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన అన్నదాతలను కొంతమంది సీఆర్‌డీఏ ఉద్యోగులు జలగల్లా పీల్చి పిప్పి చేస్తున్నారు. రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లు చేయకుండా తిప్పించుకుంటున్నారు. ఏదో ఒక కారణం చూపిస్తూ వారాల తరబడి ప్రక్రియను సాగదీస్తున్నారు. రిజిస్ట్రేషన్ల కోసం కొందరు ఉద్యోగులు లక్షల రూపాయల్లో లంచాలు డిమాండ్ చేస్తుండటంతో రైతులు బెంబేలెత్తిపోతున్నారు. రిజిస్ట్రేషన్ కోసం అబ్బరాజుపాలెం గ్రామానికి చెందిన భోగినేని సుధీర్ అనే రైతు, కంప్యూటర్ ఆపరేటర్ అశోక్‌ల మధ్య డబ్బు డిమాండ్ చేస్తూ సాగిన ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తూ...
- అబ్బరాజుపాలేనికి చెందిన భోగినేని కోటేశ్వరావు అమరావతి భూసమీకరణలో ఎకరన్నర భూమి ఇచ్చారు. ఆయనకు సీఆర్‌డీఏ 1,500 చదరపు గజాల నివాస, 360 చదరపు గజాల కమర్షియల్ ప్లాట్లు కేటాయించింది. కోటేశ్వరావుకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కోటేశ్వరరావు, అతని కుమార్తె మృతి చెందడంతో, తనతో పాటు తన సోదరి కుమారుల పేర్లపై ప్లాట్లను బదిలీ చేయాలని రైతు కుమారుడు సుధీర్ సీఆర్‌డీఏ ఆఫీస్‌కి వెళ్లారు. రిజిస్ట్రేషన్ కోసం సుధీర్ సీఆర్డీఏలో అబ్బరాజుపాలెం, బోరుపాలెం గ్రామాల రిజిస్ట్రేషన్ పనులు చేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ అశోక్‌ను సంప్రదించగా, అతడు లక్ష రూపాయల లంచం డిమాండ్ చేశారు. తర్వాత తనకు ఎంత ఇచ్చినా ఫర్వాలేదని తమ సర్ కోసం 50 వేల రూపాయలు ఇవ్వాలని కోరారు. ఈ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
- తుళ్లూరుకు చెందిన మరో రైతు తన ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాలంటూ అసలైన పత్రాలను సీఆర్‌డీఏ అధికారులకు ఇచ్చారు. ఉన్నతాధికారుల నుంచి అనుమతి రాలేదంటూ దాదాపు వంద రోజుల పాటు ఆఫీస్ చుట్టూ తిప్పుకొని ఇటీవల రిజిస్ట్రేషన్ చేశారు.
సీఆర్‌డీఏ పరిధి పునరుద్ధరణ - అమరావతితో పాటు సమీప ప్రాంతాలు సమగ్రాభివృద్ధి!