Vijayawada Highway Traffic Advisory : తెలుగు రాష్ట్రాల్లో జరుపుకునే అతిపెద్ద పండగ సంక్రాంతి. రేపటి నుంచి విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడంతో అందరూ సొంతూళ్లకు బయలుదేరుతున్నారు. దీంతో అన్ని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ, రైల్వే ప్రత్యేక సర్వీసులను నడిపిస్తోంది. ఉద్యోగం, ఉపాధి, వ్యాపార రీత్యా హైదారాబాద్‌లో ఉండేవారు పండగకు తప్పకుండా సొంతూళ్లకు వెళ్తుంటారు.
అప్రమత్తంగా ఉండాలి :
ఇక్కడ హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సంక్రాంతి పండగ సమయంలో ఈ రహదారిపై వాహనాలు ఒకదాని వెనుక ఒకటి వరుస కడతాయి. అందరూ పండక్కి నగరం నుంచి సొంతూళ్లకు నగరం బాట పట్టడంతో రహదారిపై వాహనాల రద్దీ పెరుగుతుంది. అయితే, ఈ రహదారిపై ప్రయాణించేవారు అప్రమత్తంగా ఉండాలని పోలీసుల సూచిస్తున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్ - విజయవాడ హైవేపై దారి పొడవునా మరమ్మతు పనులు నడుస్తున్నాయి. ఎల్బీనగర్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం వరకు 6 వరుసల విస్తరణ పనులు చేపడుతున్నారు. అలాగే దండుమల్కాపురం నుంచి ఏపీలోని నందిగామ వరకు బ్లాక్‌స్పాట్స్‌లో (తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలలో) అండర్‌పాస్‌లు, సర్వీసు రోడ్ల నిర్మాణాన్ని చేపడుతున్నారు.
ఇనామ్‌గూడ వద్ద అండర్‌పాస్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. డ్రైవింగ్ చేసేటప్పుడు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదాలు సంభవించడంతోపాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు. అందుకే ఈ మార్గంలో వెళ్లే వాహనదారులను అప్రమత్తంగా డ్రైవింగ్ చేయాలని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు, పోలీసులు సూచిస్తున్నారు.
పండగకు సొంతూళ్లకు వెళ్లే వారు అబ్దుల్లాపూర్‌మెట్, హయత్‌నగర్ బస్టాప్‌ల వద్ద ఎక్కువ మంది ఉంటారు. ఈ ప్రదేశాల్లో విస్తరణ చేపట్టకపోవడంతో ఆయాచోట్ల ట్రాఫిక్ ఇక్కట్లు తలెత్తే అవకాశముంది. సంక్రాంతి పండక్కి వెళ్లే వాహనాలతో ఇక్కడ ట్రాఫిక్‌జామ్ అయ్యే అవకాశముందని, వంతెన మీద మట్టి రోడ్డుపై రాకపోకలు సాగించేలా చర్యలు తీసుకుంటామని వనస్థలిపురం ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ భూపతి గట్టుమల్లు తెలిపారు.
నిదానంగా వెళ్లాలి :
దండుమల్కాపురం నుంచి నందిగామ మధ్య తరచూ ప్రమాదాలు జరిగే 17 ప్రాంతాల్లో మరమ్మతు పనులను అధికారులు చేపడుతున్నారు. రోడ్డు విస్తరణ పనులు జరిగే చౌటుప్పల్, చిట్యాల తదితర ప్రాంతాల్లో సర్వీసు రోడ్లు అస్తవ్యస్తంగా మారాయి. కాబట్టి, ఆయా ప్రాంతాల్లో వాహనదారులు నిదానంగా వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు.
దొంగల భయం లేకుండా:
- సంక్రాంతి పండుగ సొంతూళ్లకు వెళ్తున్న నగరవాసులకు ఇల్లు గుల్లవుతుందేమోనని భయం పట్టుకుంది. కొన్నిచోట్ల పట్టపగలే చోరీలు జరుగుతుండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అయితే, సొంతూళ్లకు వెళ్లే వారికి పోలీసులు కొన్ని సూచనలు చేస్తున్నారు.
- వీలైతే కాలనీల్లో, ఇంటి పరిసరాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు చేసుకోండి.
- ఇంట్లో ఏదో ఒక గదిలో లైటు వేసి ఉంచండి.
- పండక్కి సొంతూళ్లో ఎక్కువ రోజులు ఉండేవారు పేపర్, పాల ప్యాకెట్లు వేయవద్దని వారికి చెప్పండి.
- నమ్మకమైన ఇరుగు పొరుగు వాళ్లకు మీ ఇంటిని గమనించమని చెప్పండి. తాళం వేసిన తర్వాత కనపడకుండా డోర్ కర్టెన్ తప్పకుండా వేయాలి.
- ఇంట్లో బంగారం, డబ్బు, విలువైన వస్తువులు ఉంటే ఆ సమాచారాన్ని ఇతరులతో పంచుకోవద్దు.
- అలాగే పండక్కి సొంతూళ్లు వెళ్లిన వారు అక్కడ చెరువులు, కాలువల్లో ఈత కొట్టడం చేయవద్దు. ఎందుకంటే కొత్తగా వెళ్లి వారికి అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. కాబట్టి, జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
కోడిపందేలు, రికార్డింగ్ డాన్సులు - ఎక్కడెక్కడ ఏమేం స్పెషల్ అంటే!