CPI Narayana Visit N Convention: సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. మాదాపూర్‌లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేసిన ప్రాంతాన్ని ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. పేదలు గజం స్థలం ఆక్రమిస్తేనే నానా రాద్ధాంతం చేస్తారని పేర్కొన్నారు. చెరువులు కబ్జా చేయడం వల్ల హైదరాబాద్ పట్టణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వర్షం పడితే చాలు నీళ్లు ఇళ్లలోకి వస్తున్నాయని అన్నారు.
నాగార్జున బిగ్ బాస్‌కే బాస్ : నాగార్జున బిగ్ బాస్‌కే బాస్ అని, చెరువును ఆక్రమించుకుని కబ్జాలు చేశారని అన్నారు. ఆయనేం సత్య హరిశ్చంద్రుడు కాదని, ఎన్ కన్వెన్షన్ మీద రోజుకు రూ.లక్షల ఆదాయం వచ్చేదని తెలిపారు. ఆయనకు చాలా డబ్బులు ఉన్నాయని, ఇదంతా లెక్క కాదని అన్నారు. మధ్య తరగతి, పేద ప్రజల ఇళ్ల గురించి ఆలోచించి ప్రభుత్వం ముందుకు వెళ్లాలని సూచించారు.
చెరువుల్లో కాలేజీలు కట్టారు : మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి చెరువులో కాలేజీలు కట్టారని, వారంతా కబ్జాకోరులని విమర్శించారు. అక్కడ ఫిరంగి నాలాను కబ్జా చేశారని ఆరోపించారు. చెరువులు, నాలాలు కబ్జా అయితే ఊర్లు మునిగిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఆరంభ శూరత్వం కాదని, ఎక్కడ కబ్జా జరిగినా ఖాళీ చేయించాలని, పెద్దలు కబ్జాలు చేసినా, దొంగ పట్టాలు పొందినా వారి ఆస్తులు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరారు.