Courier Business is Booming in Karimnagar :విద్య, ఉద్యోగం, ఉపాధి, వ్యాపారం నిమిత్తం ఏటా ఉమ్మడి జిల్లా నుంచి విదేశాలకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో స్థిరపడిన భారత కుటుంబాలు చాలానే ఉన్నాయి. అక్కడ వారికి సమయం లేకనో, ఆరోగ్యం తదితర కారణాల వల్ల ఇక్కడి తినుబండారాలు, పచ్చళ్లకు విదేశాల్లో బాగా గిరాకీ పెరిగింది. దీంతో ఇక్కడి నుంచి కొరియర్ చేసుకొంటున్నారు. మందులు, వంట సామగ్రి, పప్పులనూ ఇక్కడి నుంచి ఇతర దేశాలకు పంపిస్తుండటంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రంలో కొరియర్ సంస్థల వ్యాపారం బాగా పెరిగిపోయింది.
తినుబండారాలే అధికం :అమెరికా, ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో భార్యాభర్తలు ఉద్యోగం చేస్తేనే కుటుంబ పోషణతో పాటు డబ్బు పొదుపు చేసుకోవడానికి వీలుంటుంది. విధులు నిర్వర్తించడం, ఖాళీ సమయం ఎక్కువ ఉండకపోవడంతో, ఆరోగ్యం, రుచులపరంగా ఇంటి నుంచి తెప్పించుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితుల సాయంతో లేదా కొరియర్ ద్వారా పార్సిల్ చేయించుకుంటున్నారు. దీనికి అనుగుణంగా కొరియర్ సంస్థలు ఫెడెక్స్, యూపీఎస్, డీహెచ్‌ఎల్, ఇతర సంస్థలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకొని వస్తువులను పార్సిల్ చేస్తున్నాయి. ఎక్కువగా పచ్చళ్లు, మిఠాయిలు, పిండి పదార్థాలు, మందులు(మెడిసిన్స్) విదేశాలకు కొరియర్ చేస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు.
కిలోలను బట్టి ధరలు : కిలో పార్సిల్‌కు రూ.2800, 10 కిలోల పైన ఉంటే కిలోకు రూ.660-700 చొప్పున తీసుకుని పార్సిల్ చేస్తున్నారు. మందులకు అయితే రూ.3400 (500 గ్రాములు) ఛార్జీలు తీసుకుంటున్నారు. విదేశాలకు కొరియర్లు పంపించే వ్యాపారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏటా రూ.2 కోట్లకు పైగా జరుగుతుందని వ్యాపారులు చెబుతున్నారు. దసరా, సంక్రాంతి, పచ్చళ్ల సీజన్లలో గిరాకీ అధికంగా ఉంటుందని తెలిపారు.
తిండి లేని స్థితి నుంచి పది మందికి ఉపాధి ఇచ్చే స్థాయికి - జూట్ సంచుల వ్యాపారంలో రాణిస్తున్న ఒంటరి మహిళ - Inspiring women Story from Gajwel
"ఎక్కువగా అమెరికాకు పార్శిళ్లు వెళ్తుంటాయి. రోజువారీగా కొరియర్లు తక్కువగానే ఉన్నా, సంక్రాంతి, దసరా పండుగలప్పుడు ఎక్కువగా ఉంటాయి. వినియోగదారుడు పార్సిల్ బుక్ చేసుకున్న తర్వాత అతనికి లింక్ పంపిస్తాం. దాని ద్వారా పార్సిల్ ఎక్కడ ఉంది. డెలివరీ అయిందా? అనే వివరాలు తెలుసుకోవచ్చు. మేము 100కు పైగా దేశాలకు వస్తువులు పంపుతుంటాం."- గడ్డం విలాస్‌రెడ్డి, కొరియర్ సంస్థ నిర్వాహకుడు
ఏయే దేశాలకు, ఏమేం పంపిస్తున్నారంటే?
- కరీంనగర్ నుంచి అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, జర్మనీ, కెనడా, సింగపూర్, మలేషియా తదితర 100 దేశాలకు పార్సిళ్లను పంపించే వెసులుబాటును కొరియర్ సంస్థలు అందిస్తున్నాయి.
- మందులు పంపితే వైద్యుడి ప్రిస్క్రిప్షన్, ఆధార్, చరవాణి నంబర్, స్వీకరించే వ్యక్తికి సంబంధించిన పాస్‌పోర్టు జిరాక్స్ పేపర్లు, చిరునామా తప్పనిసరిగా జత చేస్తేనే పార్సిల్ చేస్తున్నారు.
- ప్రతిరోజు కరీంనగర్ నుంచి 15 నుంచి 20 వరకు, నెలకు దాదాపు 500కుపైగా, పండుగల (సంక్రాంతి, దసరా) సీజన్లలో అయితే రోజుకు 200 నుంచి 300 వరకు, నెలకు 3 వేలకు పైగా విదేశాలకు పార్సిళ్లు వెళ్తుంటాయని వ్యాపారస్థులు తెలిపారు. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల నుంచి గల్ఫ్ వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో వారు కరీంనగర్ వచ్చి కొరియర్ వ్యాపారం చేస్తుంటారు.
- పార్సిళ్లల్లో 80 శాతం అమెరికాకే బుక్ అవుతుండగా యూకే(10 శాతం), ఆస్ట్రేలియా, సింగపూర్, గల్ఫ్ తదితర దేశాలకు మరో పది శాతం వెళ్తున్నట్లు ఓ కొరియర్ నిర్వాహకుడు తెలిపాడు.సోమవారం పార్సిళ్లు బుకింగ్ చేస్తే ఆయా దేశాలను శుక్రవారం చేరే అవకాశముంది. శని, ఆదివారాలు సెలవు కావడంతో వాటిని తీసుకోవడానికి ఇంటి వద్ద ఉంటారనే ఉద్దేశంతో సోమవారం ఎక్కువ బుకింగ్స్ చేస్తున్నారు.
- బంగారం, వెండి, కొబ్బరి(కుడుకలు), కొబ్బరి పొడి, నూనెలు, బ్లేడ్లు, పిన్నీసులు, పిన్నులు, కరివేపాకు, మండే వస్తువులను కొరియర్ చేయడానికి అనుమతి ఉండదు.
'అమ్మ'గా బిర్యానీ వండి పెడుతున్నారు- క్యాటరింగ్ బిజినెస్‌లో ట్రాన్స్‌జెండర్ టీమ్ సెక్సెస్ స్టోరీ - Transgender Catering Business
రూ.4.25 లక్షల కోట్ల 'పెళ్లిళ్ల సీజన్'! - ఒక్కటి కానున్న 35 లక్షల జంటలు - WEDDING BUSINESS IN INDIA 2024