Couple Suicide Finance Company Harassment in Guntur District :అనుకోకుండా జరిగే ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవడంతో కొందరి కలలు చిధ్రమవుతుంటాయి. అనారోగ్యంతో మరికొందరు ఈ లోకాన్ని వీడాల్సి వస్తుంది. కానీ అన్నీ సరిగ్గా ఉండి, చిన్న చిన్న సమస్యలకే జడిసి జీవితాల్ని చీకటి చేసుకునే వారు అనేకం. ఈ తరహాలోనే ఆర్ధిక సమస్యలు బాపట్ల జిల్లాకు చెందిన ఓ రైతు కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేశాయి.
బాపట్ల జిల్లాలోని చదలవాడకు చెందిన పోలిశెట్టి శ్రీనివాసరావు ఓ రైతు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇద్దరు పిల్లలు. కుమార్తె బీటెక్ పూర్తి చేయగా, కుమారుడు ఇంటర్ చదువుతున్నాడు. ఇంటి అవసరాల రీత్యా ఓ ప్రైవేటు కంపెనీలో రూ.15 లక్షలు రుణం తీసుకున్నారు. నెలనెలా కిస్తీలు కడుతున్నాడు. కానీ సాగులో నష్టం రావడం, వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో రెండు నెలల నుంచి వాయిదాలు చెల్లించడం లేదు.
ఇంటికి నోటీసులు : దీంతో ఫైనాన్స్ కంపెనీ అప్పు చెల్లించాలని ఒత్తిడి చేసింది. సంస్థ ప్రతినిధులు ఇంటికి వచ్చి డబ్బు చెల్లించాలని వేధించారు. అంతటితో ఆగకుండా ఇంటికి నోటీసులు అంటించారు. దీన్ని శ్రీనివాసరావు అవమానంగా భావించాడు. అంతే ఇలాంటి పరిస్థితిలో దిక్కుతోచక భయంకరమైన నిర్ణయం తీసుకున్నాడు. భార్య పుష్పలతతో కలిసి గుంటూరు జిల్లా నారాకోడూరు వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే భార్య అక్కడికక్కడే మృతి చెందగా, శ్రీనివాసరావు కొన ఊపిరితో ఆసుపత్రిలో చేరారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఆయన మృతి చెందారు. తల్లిదండ్రుల మరణవార్త విని ఇంటర్ చదువుతున్న కుమారుడు షాక్కు గురై పక్షవాతం బారినపడ్డాడు. ప్రస్తుతం తెనాలి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కుమార్తెకు విషయం తెలిసి దిక్కుతోచని స్థితిలో పడింది.