Police Department Corruption In Hyderabad: పనితీరు, సాంకేతికత వినియోగంలో రాష్ట్ర పోలీసులకు దేశవ్యాప్తంగా ఎనలేని కీర్తి వచ్చింది. కొందరు పోలీసులు మాత్రం శాఖకు అవినీతి మరక అంటిస్తున్నారు.లంచం తీసుకోవడం, ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్ అవ్వడమే ఇందుకు నిదర్శనం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అవినీతి ఆరోపణలపై వచ్చిన ఫిర్యాదులపై స్పందించి సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నా పలు పోలీస్‌స్టేషన్ల సిబ్బంది తీరు మారడం లేదు. కళ్లెదుట సహచరులు సస్పెన్షన్ వేటుకు గురై ఛార్జి మెమోలు అందుకుంటున్నా కొందరు ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు దర్జాగా చేతివాటం చూపిస్తున్నారు.
పోలీసు ఠాణాలను సెటిల్‌మెంట్లకు అడ్డాగా మార్చి అందినంత దండుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పలు ఠాణాల్లో పనిచేసే సిబ్బందికి క్రమశిక్షణ లోపించిందనే విమర్శలు ఉన్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటం అవినీతి అధికారులకు వరంగా మారింది. కొందరు ఇన్‌స్పెక్టర్లు సివిల్ దుస్తుల్లోనే విధులు నిర్వహిస్తున్నట్టు ఉన్నతాధికారులు గుర్తించారు. రాత్రి విధులకు డుమ్మా కొడుతూ పబ్‌లు, బార్లలో గడుపుతున్నారని సైబరాబాద్, హైదరాబాద్ పరిధిలో నలుగురు ఎస్సైలకు మెమోలు జారీ చేసినట్టు సమాచారం.
Corruption Allegations Against Hyderabad CCS Officers :కొన్ని పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు అందగానే దళారులు రంగంలోకి దిగుతున్నారు. అంతా మేం చూసుకుంటామంటూ కేసు తీవ్రతను బట్టి రేటుగట్టి వసూళ్లకు పాల్పడుతున్నారు. దళారుల మాటలు నమ్మి కమీషన్‌పై ఆశతో ప్రజాభవన్ వద్ద మద్యం మత్తులో డివైడర్‌ను ఢీకొట్టిన కేసులో మాజీ ఎమ్మెల్యే కుమారుడిని తప్పించిన ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు కొలువులకు దూరమయ్యారు. ఇదే తరహాలో తూర్పు మండలం పరిధిలో ఒక పోలీస్ అధికారి రోడ్డు ప్రమాదం కేసు తారుమారు చేసి సస్పెన్షన్ వేటుకు గురయ్యారు.